Israel: అమెరికా అనూహ్య నిర్ణయం.. ఇజ్రాయెల్‌ సెటిలర్లపై ఆంక్షలు!

Israel: వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనావాసులపై హింసకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ సెటిలర్లపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 02 Feb 2024 11:05 IST

వాషింగ్టన్‌: వెస్ట్‌ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్‌ సెటిలర్లపై (Israeli settlers) అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనావాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) ఉత్తర్వులు జారీ చేశారు. మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు చెందిన పౌరులపై అగ్రరాజ్యం ఇలా అనూహ్య చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలిదశలో భాగంగా వెస్ట్‌బ్యాంక్‌లోని నలుగురు ఇజ్రాయెల్‌ సెటిలర్లపై (Israeli settlers) అమెరికా ఆర్థిక ఆంక్షలతో పాటు వీసా నిషేధం విధించింది. వీరు పాలస్తీనావాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, ఆస్తులను ధ్వంసం చేయటంతో పాటు వాటిని లాక్కుంటామని బెదిరించారని ఆరోపించింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Israel Hamas conflict) ప్రారంభమైన తర్వాత సామాన్య పౌరులపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.

తమ పౌరుల్లో కొంత మందిని ఇజ్రాయెల్‌ సెటిలర్లు (Israeli settlers) చంపేశారని.. కార్లకు నిప్పంటించారని పాలస్తీనా అధికారులు ఇటీవల ఆరోపించారు. దాడులు చేస్తూ వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బైడెన్‌ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. హమాస్‌ను అంతమొందించే లక్ష్యంలో కొంత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు ఇటీవల సూచించారు.

హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం వెస్ట్‌ బ్యాంక్‌లోనూ దాడులు ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని పోరాడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్కడి సెటిలర్లు పాలస్తీనా పౌరులపై దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిని ఇజ్రాయెల్‌ సైన్యం నిలువరించటం లేదని.. పైగా రక్షణ కల్పిస్తోందని పాలస్తీనా అధికారులు చెబుతున్నారు. వెస్ట్‌బ్యాంక్‌లోని చాలా మంది సెటిలర్లకు అమెరికా పౌరసత్వం ఉంది. కొంత మంది ద్వంద్వ పౌరసత్వమూ కలిగి ఉన్నారు. వారెవరూ హింసాత్మక చర్యల్లో పాల్గొనటంలేదని యూఎస్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని