Gaza: ఇజ్రాయెల్‌ దాడులు.. గాజాలో 20వేలు దాటిన మృతుల సంఖ్య

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి సామాన్య ప్రజలు బలవుతున్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గాజాలో మొత్తం 20వేల మంది మృతి చెందినట్లు తాజాగా గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Published : 24 Dec 2023 03:21 IST

జెరూసలెం: గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం(ఐడీఎఫ్‌) జరిపిన దాడుల్లో శనివారం ఒక్కరోజే 200 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా అధికారులు తెలిపారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గాజాలో 20,258 మంది మృతి చెందారని హమాస్‌ ఆధీనంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపింది. 

గాజాలో ఇజ్రాయెల్‌ సృష్టించిన విధ్వంసం కారణంగా అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 24 లక్షల జనాభాలో 19 లక్షల మంది శరణార్థి శిబిరాలు, టెంట్లలో తలదాచుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. నీరు, ఆహారం, వైద్య సేవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. వారికి సాయం చేయాలంటే మానవత్వంతో కాల్పులు విరమించడం ఒక్కటే మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. ఇజ్రాయెల్‌ తన చర్యలతో మానవతా సాయానికి అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. 

హమాస్‌ దాడిలో ఐదుగురు ఇజ్రాయెల్‌ సైనికులు మృతి

హమాస్‌ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హమాస్‌తో జరిగిన పరస్పర దాడుల్లో తమ బలగాలకు చెందిన ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. శుక్రవారం దక్షిణ గాజాలో నలుగురు, శనివారం ఉత్తర గాజాలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

గాజాలో భీకర దాడి.. ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి..!

నెతన్యాహుకి బైడెన్‌ ఫోన్‌

గాజాలో శనివారం జరిగిన భీకర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై వారిద్దరు చర్చించినట్లు శ్వేతసౌధం ప్రతినిధులు తెలిపారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని, అయితే.. గాజాలో మృతుల సంఖ్య పెరగడం, మానవతా సాయం సంక్షోభంలో పడటం పట్ల ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని