Trump: ‘ఎక్కడైనా.. ఎప్పుడైనా’.. బైడెన్‌కు ట్రంప్‌ సవాల్‌

Trump: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి బైడెన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్‌కు ట్రంప్‌ సవాల్‌ విసిరారు.

Updated : 07 Mar 2024 13:57 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), జో బైడెన్‌ పోటీ పడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్‌కు (Joe Biden) ట్రంప్‌ సవాల్‌ విసిరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను ప్రజల ముందుంచడం అవసరమని వ్యాఖ్యానించారు.

‘‘అమెరికా ప్రయోజనాలు, దేశ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని కీలక అంశాలపై నేను, జో బైడెన్‌ చర్చించడం చాలా అవసరం’’ అని ట్రంప్‌ తన ట్రుత్‌ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. తాను ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బైడెన్‌కు సవాల్‌ విసిరారు. అయితే, ప్రైమరీ ఎన్నికల సమయంలో పార్టీలో తనతో పోటీ పడిన వారితో జరిగిన చర్చల్లో మాత్రం ట్రంప్‌ పాల్గొనలేదు. మంగళవారం 15 రాష్ట్రాలు, ఒక టెర్రిటరీలో ‘సూపర్‌ ట్యూస్‌డే’ పేరిట జరిగిన ప్రైమరీ/కాకసస్‌లలో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ఘనవిజయం సాధించారు. ఒక్క వెర్మాంట్‌లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు.

వెర్మాంట్‌ను భారత సంతతి అమెరికన్‌ నిక్కీ హేలీ (Nikki Haley) కైవసం చేసుకున్నారు. మిగతా ప్రైమరీల్లోనూ ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. అయితే తాజా ఓటములతో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష నామినేషన్‌ రేసు నుంచి వైదొలగుతున్నట్లు హేలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో రిపబ్లికన్‌ అధ్యక్ష రేసులో ట్రంప్‌ ఒక్కరే మిగిలారు. మరోవైపు డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష నామినేషన్‌ రేసులో ఉన్న 81 ఏళ్ల బైడెన్‌.. సమోవా టెర్రిటరీలో తప్ప 15 రాష్ట్రాల్లోనూ విజయం సాధించారు. సమోవాలో జేసన్‌ పామర్‌ చేతిలో ఓడారు. ఇప్పటి వరకైతే అధికారికంగా వీరివురి మధ్యే పోటీ అని తేలకపోయినప్పటికీ.. అది లాంఛనమేనని స్పష్టమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని