UKraine Crisis: ఒప్పుకోకపోతే మరో 20మందిని తీసుకొస్తా.. 16ఏళ్ల యువతిపై రష్యా సైనికుడి దాష్టీకం

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న భీకర దండయాత్ర బయటకు కన్పించేది ఒక ఎత్తయితే.. యుద్ధం ముసుగులో చీకట్లో జరుగుతోన్న దారుణాలు మరో ఎత్తు. శత్రుదేశం సైనికుల చేతుల్లో ఉక్రెయిన్‌ మహిళల మాన, ప్రాణాలు మంటగలసిపోతున్నాయి.

Published : 29 Apr 2022 02:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న భీకర దండయాత్ర బయటకు కనిపించేది ఒక ఎత్తయితే.. యుద్ధం ముసుగులో చీకట్లో జరుగుతోన్న దారుణాలు మరో ఎత్తు. శత్రుదేశం సైనికుల చేతుల్లో ఉక్రెయిన్‌ మహిళల మాన, ప్రాణాలు మంటగలసిపోతున్నాయి. ఓ వైపు ఆ దేశాన్ని ఆక్రమించేందుకు బాంబులు విసురుతూ.. మరోవైపు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. పిల్లలను సైతం వదలకుండా ఆడవాళ్లపై రష్యా సేనలు సాగిస్తోన్న దురాగతాలు యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. క్రెమ్లిన్‌ అధీనంలో ఉన్న ఖేర్సన్‌ పరిధిలోని ఓ గ్రామంలో రష్యా సైనికుడు తప్పతాగి 16ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దారుణం ఆమె మాటల్లోనే..

‘‘బాంబు దాడులను తప్పించుకొనేందుకు మా కుటుంబమంతా కలిసి అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్‌లోని షెల్టర్‌లో ఉంటున్నాం. ఓ రోజు ఆహారం కోసం మా అమ్మ మమ్మల్ని బయటకు తీసుకెళ్లింది. అప్పుడొక తాగి ఉన్న రష్యన్ సైనికుడు మమ్మల్ని చూసి మా షెల్టర్‌ వరకు వెంటపడ్డాడు. మా అమ్మను ఆపి మా వయసెంత అని అడిగాడు. అక్కడ నాతో పాటు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయని అడిగాడు. ముందు మా అమ్మను రమ్మన్నాడు. కాసేపటికే ఆమెను పంపించి నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను ప్రతిఘటిస్తే తుపాకీతో భయపెట్టాడు. ఒప్పుకోకపోతే మరో 20 మంది మగవాళ్లను తీసుకొస్తా అని బెదిరించాడు. అడ్డుకుంటే చంపేస్తానన్నాడు. అక్కడే ఉన్న మరో సైనికుడు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా అతడు వినిపించుకోలేదు సరికదా.. బలవంతంగా నాపై దాడి చేశాడు’’

‘‘ఆ దారుణం అక్కడితో ఆగిపోలేదు. తర్వాత రోజు నన్ను మరో సైనికుడు పిలిచాడు. అతడు కూడా నన్ను బెదిరించి అత్యాచారం చేస్తానన్నాడు. నాకు చాలా భయం వేసింది. ఏడుపొచ్చింది. అయితే, నేను నిజం చెబుతున్నానా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్లు నన్ను పరీక్షించారు. ఒకవేళ ఆ రోజు మేం ఆహారం కోసం బయటకు వెళ్లకపోయి ఉంటే అతడు మమ్మల్ని చూసేవాడే కాదు. అతడు నన్ను తాకేవాడే కాదు’’ అంటూ ఆ యువతి స్థానిక మీడియా వద్ద బోరున విలపించింది.

ఈ దారుణ ఘటనపై ఉక్రెయిన్‌ అధికారులు విచారణ చేపట్టగా నిజమే అని తేలింది. మార్చి తొలి నాళ్లలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని యుద్ధ నేరంగా పరిగణిస్తామని అధికారులు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

అయితే ఒక్క ఖేర్సన్‌ మాత్రమే కాదు.. ఇలాంటి దారుణాలు ఉక్రెయిన్‌ వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. యుద్ధం పేరిట దేశంలోకి ప్రవేశించిన రష్యన్‌ సైనికులు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ మధ్య బుచాలో మారణహోమానికి పాల్పడ్డ రష్యన్‌ సేనలు.. అక్కడ మహిళలతో దారుణంగా వ్యవహరించారు. ముఖ్యంగా 14-16 ఏళ్ల బాలికలపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని