Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్‌ చురకలు!

ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పిలుపునిచ్చారు.

Published : 26 Sep 2023 20:56 IST

ఐరాస: ‘రాజకీయ సౌలభ్యం’ ఆధారంగా హింస, ఉగ్రవాదంపై ప్రతిస్పందన ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఐరాస సభ్యదేశాలు అంగీకరించకూడదని చెప్పారు. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై ఇటీవల పాకిస్థాన్‌ ప్రధాని (ఆపద్ధర్మ) అన్వర్‌-ఉల్‌-హక్‌ కాకర్‌ ఐరాసలో చేసిన వ్యాఖ్యలు, మరోవైపు భారత్‌- కెనడాల మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఈవిధంగా మాట్లాడారు.

‘టీకాల విషయంలో వర్ణవివక్ష వంటి అన్యాయాలను మళ్లీ అనుమతించకూడదు. వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి ఉండకూడదు. పేద దేశాల నుంచి ధనిక దేశాలకు ఆహారం, ఇంధనం అందించేందుకు మార్కెట్‌ శక్తులను ఉపయోగించకూడదు. రాజకీయ సౌలభ్యం ఆధారంగా ఉగ్రవాదం, హింసపై ప్రతిస్పందించడాన్ని అనుమతించకూడదు. అదేవిధంగా ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదు’ అని జైశంకర్‌ పిలుపునిచ్చారు.

‘చరిత్రను మరచిపోవడం అత్యంత దారుణం’.. కెనడాపై మండిపడ్డ రష్యా

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల హస్తం ఉండవచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలను ఉద్దేశించి.. జైశంకర్‌ పరోక్షంగా ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే దౌత్యపరంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల దౌత్య కార్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని