Earthquake: మూడు రోజుల్లో రెండుసార్లు.. మృత్యుంజయులుగా నిలిచిన తల్లీబిడ్డ!

సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డారు తల్లీబిడ్డ. భూకంపం ధాటికి ఒకసారి పాక్షికంగా, మరోసారి పూర్తిగా ఇల్లు కూలిపోయిన ఘటనలనుంచి వారిని కాపాడారు.

Published : 14 Feb 2023 17:36 IST

డమాస్కస్‌: తుర్కియే(Turkey), సిరియా(Syria)లను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలు, మృతదేహాలతో స్థానికంగా పరిస్థితులు దారుణంగా మారాయి. ఇంతటి నష్టాన్ని మిగిల్చిన ఘోర విపత్తులోనూ ఓ తల్లి, ఆమె శిశువు మాత్రం మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలతో బయటపడటం విశేషం. సిరియాలోని జిందిరెస్‌ ప్రాంతానికి చెందిన దిమా ఏడు నెలల గర్భిణి. ఫిబ్రవరి 6న భూకంపం(Earthquake) సంభవించిన సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో భూ ప్రకంపనల ధాటికి ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే సిరియన్ అమెరికన్ మెడికల్ సొసైటీ(SAMS) సహకారంతో ఆమెను అఫ్రిన్‌లోని ఆసుపత్రికి తరలించగా.. మగశిశువుకు జన్మనిచ్చింది.

అయితే, ప్రత్యామ్నాయ ఆశ్రయం అందుబాటులో లేకపోవడంతో ఆమె తన శిశువుతో మళ్లీ అదే ఇంటికి తిరిగిరావాల్సి వచ్చింది. భూకంపం ధాటికి అప్పటికే బలహీనంగా మారిన ఆ ఇల్లు.. మూడు రోజులకు పూర్తిగా కూలిపోయింది. దీంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన తల్లీబిడ్డను మరోసారి రక్షించారు. డీహైడ్రేషన్‌, కామెర్లతో అప్పటికే ఆ శిశువు పరిస్థితి విషమంగా మారడంతో.. అదే ఆస్పత్రికి మళ్లీ తరలించారు. దిమాకు సైతం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక టెంట్‌ కింద తలదాచుకుంది. వాయువ్య సిరియాలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈ పట్టణం.. ఇటీవలి భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. విపత్తుకు ముందు నుంచే మానవతా సాయంపై ఆధారపడుతోన్న స్థానికుల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారింది.

భూకంపం కారణంగా జిందిరెస్‌ ప్రాంతంలోని 55 ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయని ఐరాస తెలిపింది. మరో 31 పాక్షికంగా పని చేయడం, లేదా నిలిచిపోయినట్లు వెల్లడించింది. శిథిలాల నుంచి బయటపడుతోన్న బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన మందులు, ఇతర వైద్య సామగ్రి, పడకలు, దుప్పట్ల కొరత తీవ్రంగా ఉందని స్థానిక వైద్యులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. దీంతోపాటు ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని