London: ‘చావులపై ఆసక్తి’.. ఇప్పటికే 200పైగా అంత్యక్రియలకు హాజరైన మహిళ

మరణాలు, అత్యక్రియలంటే తనకు ఎంతో ఇష్టమని బ్రిటన్‌కి చెందిన ఓ మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఇప్పటికే 200లకు పైగా అంత్యక్రియలకు హాజరైనట్లు తెలిపింది.

Published : 17 Oct 2022 01:29 IST

లండన్‌: ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లాలని.. రుచికరమైన భోజనం చేయాలని.. రంగుల ప్రపంచంలో గడపాలని..ఇలా మనుషులకు కొన్ని కోరికలు ఉండటం సహజమే. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం విచిత్రమైన ఆసక్తి ఉంది. చావులు, అంత్యక్రియలంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఎక్కడ అంత్యక్రియలు జరిగినా.. వెళ్లేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. విచిత్ర ఆసక్తి ఉన్న ఆమె ఇప్పటికే 200లకు పైగా అంత్యక్రియలకు హాజరైనట్లు చెప్పారు. సమాధులు ఆర్ట్‌ గ్యాలరీల్లాంటివని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.

లండన్‌లోని ఇస్లింగ్టన్‌ ప్రాంతానికి చెందిన జీన్‌ ట్రెండ్‌హిల్‌ (55) తనకు చిన్నతనం నుంచే చావులు,  అంత్యక్రియలపై ఆసక్తి ఏర్పడిందని చెబుతోంది. గతంలో బంధువులు, మిత్రుల అంత్యక్రియలకు హాజరైన ట్రెండ్‌హిల్‌.. కొన్నేళ్లుగా అపరిచితుల అంత్యక్రియలకూ హాజరవుతున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. తరచూ శ్మశానవాటికలకు వెళ్తానని ఆమె చెప్పినట్లు తెలిపింది. అయితే, అనాథలు, స్నేహితులు లేని వ్యక్తుల శవాలేమైనా వస్తే.. దహన సంస్కారాలకు రావాలని తనను స్థానిక శ్మశానవాటిక సిబ్బంది పిలుస్తారని ఆమె తెలిపారు.

‘బంధువులెవరూ హాజరుకాని అపరిచితుల అంత్యక్రియలకు వెళ్లడం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది’ అని ట్రెండ్‌హిల్‌ పేర్కొనడం గమనార్హం. ‘నాకు చిన్నప్పటి నుంచి మరణం అంటే చాలా ఇష్టం. శ్మశానవాటికలకు వెళ్లి అక్కడి సమాధులను చూస్తూ తిరుగుతుంటాను. అవి ఆరుబయట ఆర్ట్ గ్యాలరీల్లాంటివి’ అని ఆమె చెప్పుకొచ్చింది. సమాధులు మధ్య గడుపుతూ దిగిన ఫొటోలను సైతం ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేస్తూ ఉంటారు. ట్రెండ్‌హిల్‌ 14ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి చనిపోగా.. 20 ఏళ్ల ప్రాయంలో తండ్రి మృతిచెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని