France: అదనపు వైన్‌ నాశనం చేయించడానికి రూ. 1,700 కోట్ల ఖర్చు..!

ప్రపంచంలో చాలా దేశాల్లో మద్యం కోనుగోళ్లతో జనం జేబులకు చిల్లు పెట్టుకొంటుంటే.. ఫ్రాన్స్‌ మాత్రం మిగిలిన వైన్‌ను ధ్వంసం చేయడం కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. 

Updated : 27 Aug 2023 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మద్యం కొనుగోలుకు మందుబాబులు జేబులను గుల్ల చేసుకొంటుండగా.. ఫ్రాన్స్‌ (France) మాత్రం ఉన్న మద్యం స్టాక్‌ను వదిలించుకోవడానికి ఏకంగా 200 మిలియన్‌ యూరోలు (రూ.1,700 కోట్లు) ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా దేశంలో అదనంగా ఉన్న వైన్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఇది కూడా ఓ భాగం.

ఇప్పటికే ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, కొవిడ్‌ ప్రభావంతోపాటు.. క్రాఫ్టెడ్‌ బీర్‌కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో వైన్‌ (Wine) తయారీదారులు అవస్థలు పడుతున్నారు. వైన్‌ దిగ్గజాలైన బోర్డాక్స్‌, లాంగ్యూడాక్‌ సంస్థలు గణనీయంగా వైన్‌ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. మరో వైపు డిమాండ్‌ పడిపోవడంతో ధర తగ్గిపోయింది. ‘‘మేము విపరీతంగా వైన్‌ ఉత్పత్తి చేశాం. విక్రయధరలు ఉత్పత్తి ధరల కంటే తక్కువగా ఉన్నాయి. మేము భారీగా నష్టపోతున్నాం’’ అని లాంగ్యూడాక్‌ వైన్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌కు చెందిన జేన్‌ ఫిలిప్ప్‌ గ్రానియర్‌ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు వ్యయాలను గణనీయంగా తగ్గించుకొన్నారు. ముఖ్యంగా వైన్‌ వంటి అనవసర ఖర్చులను తగ్గించారు. 

విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!

తాజాగా కేటాయించిన 200 మిలియన్‌ యూరోలతో ఫ్రాన్స్‌ ప్రభుత్వమే ఈ స్టాక్‌ను కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ధ్వంసం చేసి.. అందులోని ఆల్కాహాల్‌ను మాత్రం వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కంపెనీలకు విక్రయించనుంది. దీంతోపాటు వైన్‌ తయారీ దారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోడానికి నిధులను కేటాయించింది.

‘‘వైన్‌ ధర పతనం కాకుండా కాపాడేందుకు, ఉత్పత్తిదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొనేందుకు ఈ నిధులను వెచ్చిస్తాం. భవిష్యత్తు చూడండి.. మారుతున్న కస్టమర్ల అభిరుచులను గమనించండి’’ అని దేశ వ్యవసాయ శాఖ మంత్రి మార్క్‌ ఫెస్నో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఐరోపా కమిషన్‌ గణాంకాల ప్రకారం ఇటలీలో 7, స్పెయిన్‌లో 10, ఫ్రాన్స్‌లో 15, జర్మనీలో 22, పోర్చుగల్‌లో 34 శాతం వైన్‌ వినియోగం పతనమైనట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని