France: ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత.. న్యాయమూర్తి ముందుకు ప్రయాణికులు

మానవ అక్రమ రవాణా అనుమానంతో పారిస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న విమానంలోని ప్రయాణికులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

Published : 24 Dec 2023 14:06 IST

పారిస్‌: మానవ అక్రమ రవాణా (Human Trafficking) జరుగుతోందనే అనుమానంతో పారిస్‌ (Paris) అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది ప్రయాణికులు ఆదివారం స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం వరకు ప్రయాణికులను న్యాయమూర్తి విచారించనున్నారు. 

ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం.. విదేశీయులను ఫ్రెంచ్‌ సరిహద్దు పోలీసులు నాలుగు నుంచి ఎనిమిది రోజుల వరకు తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గరిష్ఠంగా 26 రోజులకు మించి విదేశీయులను తమ అదుపులో ఉంచుకోకూడదు. ఈ నేపథ్యంలో వారిని గమ్యస్థానాలకు పంపాలా? తిరిగి వెనక్కి పంపేయాలనేది న్యాయమూర్తి నిర్ణయిస్తారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ‘‘గతంలో ఫ్రాన్స్‌లో ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ, ఇది త్వరగా పరిష్కరించాల్సిన సమస్య. ఎందుకంటే తగిన ధ్రువపత్రాలు లేకుండా విదేశీయులను ఎక్కువ రోజులు అదుపులో ఉంచేందుకు ఫ్రాన్స్‌ చట్టాలు అనుమతించవు. ఇక వారి భవితవ్యం న్యాయమూర్తి తీర్పుపై ఆధారపడి ఉంటుంది’’ ఫ్రాంకోయిస్‌ ప్రొక్యూర్‌ అనే న్యాయవాది తెలిపారు. మరోవైపు వీరిలో కొద్ది మంది ప్రయాణికులు శరణార్థులుగా ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 

ప్రయాణికులతో సంప్రదిస్తున్నాం: భారత ఎంబసీ

రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు వెళుతూ ఇంధనం కోసం పారిస్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో ఫ్రాన్స్‌ అధికారులు ఆ విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానంలోని 303 మంది ప్రయాణికుల్లో భారతీయులే అత్యధికం. వారిలో 13 మంది మైనర్లు అని స్థానిక పత్రిక వెల్లడించింది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించేందుకుగాను సెంట్రల్‌ అమెరికాకు చేరుకునే ప్రణాళికలో భాగంగా వీరంతా నికరాగువాకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ తర్వాత ప్రయాణికుల భవితవ్యం తేలనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని