
Omicron: భవిష్యత్‌లో కొవిడ్ తీవ్రతకు ఒమిక్రాన్ కళ్లెం!
జొహెన్నెస్‌బర్గ్: కరోనాలోని ఒమిక్రాన్ వేరియంట్ వల్ల తీవ్రస్థాయి కొవిడ్-19 కేసులు తగ్గొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. భవిష్యత్‌లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వ్యక్తులకు, సమాజానికి పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చని వివరించింది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు నవంబరు, డిసెంబరులో ఒమిక్రాన్ బారినపడ్డ 23 మంది నుంచి నమూనాలు సేకరించి పరిశీలించారు. డెల్టా ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తిన రోగనిరోధక రక్షణను ఒమిక్రాన్ ఏమార్చినట్లు గుర్తించారు.
దీన్నిబట్టి డెల్టా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్ వల్ల రీ ఇన్ఫెక్షన్ కలగొచ్చని స్పష్టమవుతున్నట్లు వారు తెలిపారు. అయితే ఒమిక్రాన్‌ను జయించినవారికి డెల్టా సోకకపోవచ్చని చెప్పారు. దీనివల్ల ఒమిక్రాన్‌కు పైచేయి లభిస్తుందని వివరించారు. దీన్నిబట్టి డెల్టా రీ ఇన్ఫెక్షన్లకు ఒమిక్రాన్ అడ్డుకట్టే వేసే వీలుందన్నారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ పొందినప్పుడే ఈ ప్రభావం సాధ్యమవుతుందని చెప్పారు. టీకా పొందనివారికి ఒమిక్రాన్‌తో వచ్చే అదనపు రక్షణలో కొంతమేర కోత పడుతుందని తెలిపారు. డెల్టాను వారు సమర్థంగా ఎదుర్కోలేరని వివరించారు.