Pervez Musharraf: నిప్పుతో ముషారఫ్ చెలగాటం!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 1971 నాటి భారత్-పాక్ యుద్ధం సమయానికి సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో కమాండోగా పనిచేస్తున్నారు.
భారత్‌ను తక్కువగా అంచనా వేసి.. కశ్మీర్ ఆక్రమణకు కుట్ర
సరిహద్దును దాటి వచ్చి మరీ చొరబాటుదారులతో సమావేశం
కొర్రు కాల్చి వాతపెట్టిన భారత బలగాలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 1971 నాటి భారత్-పాక్ యుద్ధం సమయానికి సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో కమాండోగా పనిచేస్తున్నారు. ఆ యుద్ధంలో పాల్గొన్నారు కూడా. అందులో తమ దేశం పరాజయం పాలవడం, ఆ వెంటనే బంగ్లాదేశ్ ఆవిర్భవించడం ఆయనకు మింగుడు పడలేదు. భారత్‌పై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎదురుదెబ్బ కొట్టాలన్న పగతో ఎదురుచూశారు. తన వ్యూహంలో భాగంగా.. కశ్మీర్‌పై మెరుపు సైనిక చర్య చేపట్టాలని 1996లో తమ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో వద్ద ప్రతిపాదించారు. అప్పటికి ముషారఫ్ పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ హోదాలో ఉన్నారు. సైనిక చర్యకు భుట్టో నిరాకరించడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అయితే 1998 అక్టోబర్‌లో తనకు అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పగ్గాలు అప్పగించడంతో తన ప్రణాళికల అమలును ప్రారంభించారు. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌తోపాటు నియంత్రణ రేఖ, సియాచిన్, చినాబ్ నది ప్రాంతాల బాధ్యతలను తనకు నమ్మకస్థులైనవారికి అప్పగించారు.
కశ్మీర్‌ను ఆక్రమించాలని..
ముషారఫ్ ఆశీస్సులతో.. ఆయన సన్నిహితులైన మేజర్ జనరల్ జావెద్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ మెహమూద్ అహ్మద్, 10వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్‌లు ఆపరేషన్ కేపీ (కోహ్-ఇ-పైమా)కి ప్రణాళిక రచించారు. భారత బలగాల బలహీనతలను వాడుకొని కశ్మీర్‌ను ఆక్రమించవచ్చని వారు కలలుగన్నారు. ఈ ఆపరేషన్ ఆత్మహత్యా సదృశమంటూ 10వ కోర్‌లోని కొందరు జూనియర్ అధికారులు వెనకంజ వేసినా.. సీనియర్లు వినలేదు. ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోయే డిసెంబరును ఆ ఆపరేషన్ కోసం ఎంచుకున్నారు. సాధారణంగా డిసెంబరులో హిమపాతం కారణంగా కొండలపై స్థావరాలను ఇరు దేశాల బలగాలు ఖాళీ చేస్తుంటాయి. దాన్ని అవకాశంగా చేసుకుని నార్తర్న్‌లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన ఐదు బెటాలియన్లను ముజాహిద్దీన్ల ముసుగులో భారత భూభాగంలోకి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ దళ సభ్యులను పాక్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. వారికి పారామిలిటరీ శిక్షణతోపాటు కమాండో శిక్షణ కూడా ఇచ్చాయి. వీరిని పాక్ ఎస్‌ఎస్‌జీల్లో కూడా నియమిస్తారు. ఈ దళాలు కార్గిల్, బటాలిక్ సెక్టార్, ద్రాస్ ప్రాంతాల్లో 100-130 మైళ్ల పొడవునా భారత భూభాగంలోని పర్వత శిఖరాలపై ఉన్న 100కు పైగా పోస్టులను ఆక్రమించాయి. ఒక్కో పోస్టులో 10-20 మంది పాక్ సైనికులు ఉన్నారు. వారంతా సాధారణ సల్వార్ కమీజ్ దుస్తులు ధరించారు. వారి వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. 1999 మార్చి 28న ఏకంగా అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ సరిహద్దును దాటి 11 కిలోమీటర్ల మేర భారత్‌లోకి వచ్చారు. చొరబాటుదారులు నిర్మించిన స్థావరాన్ని సందర్శించారు. భారత్ గడ్డపైకి పాక్ ఆర్మీ చీఫ్ వచ్చి వారి సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అదే తొలిసారి. పాక్ మాజీ కర్నల్ అష్ఫాక్ హుస్సేనీ రాసిన ‘‘విట్నెస్ టు బ్లండర్: కార్గిల్ స్టోరీ అన్‌ఫోల్డ్’’ పుస్తకంలో దీన్ని బహిర్గతం చేశారు.
పాక్ కుట్ర భగ్నం
చొరబాట్లపై భారత దళాలకు గొర్రెల కాపర్ల ద్వారా సమాచారం అందింది. అప్రమత్తమైన మన బలగాలు.. 1999 మేలో ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఫలితంగా పాక్ కుట్ర ప్రణాళిక కకావికలమైంది. టోలోలింగ్ శిఖరాన్ని భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో పాక్ ధైర్యం సడలడం మొదలైంది. క్రమంగా నాడు కార్గిల్ యుద్ధంలో మన బలగాలు పూర్తిస్థాయిలో దాడికి దిగాయి. భారత నౌకాదళం ‘ఆపరేషన్ తల్వార్’ను చేపట్టింది. పాక్ సముద్ర మార్గంపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఆ దేశ వ్యాపారం కుంటుపడింది. కేవలం ఆరు రోజులకు సరిపడా చమురు మాత్రమే ఆ దేశంలో మిగిలింది.
ముషారఫ్‌పై ఆధారాలు బయటపెట్టి..
కార్గిల్‌లో భారత్ జూన్ 6న భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అదే నెల 11న.. పాక్ సైన్యం కుట్రను తెలియజేసేలా కీలక ఆధారాలను బహిర్గతం చేసింది. ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్, ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్‌లు జరిపిన ఫోన్ సంభాషణలను విడుదల చేసింది. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ని మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి వెల్లడించడం అందులో స్పష్టమైంది. మే 26-29 మధ్యలో వారు ఆ సంభాషణ జరిపినట్లు సమాచారం.
అమెరికా సాయం కోరి..
పాక్ దళాలు భారత్‌లోకి చొరబడటం అమెరికాకు మే నెల కంటే మందే తెలుసు. పరిస్థితి తీవ్రమవుతుందని మాత్రం ఆ దేశం అంచనా వేయలేకపోయింది. యుద్ధంలో భారత్ విరుచుకుపడుతుండటంతో సాయం కోసం అమెరికాను పాక్ ఆశ్రయించింది. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో జోక్యానికి నిరాకరించారు. మరోవైపు- భారత దళాల దాడి తీవ్రతకు బటాలిక్, ద్రాస్, టైగర్ హిల్స్‌లో పాక్ సైన్యం తోకముడిచింది. తమ సైన్యం కార్గిల్ నుంచి వైదొలగుతున్నట్లు నవాజ్ షరీఫ్ జులై 5న ప్రకటించారు. మరోవైపు బటాలిక్ సెక్టార్‌లోని మిగిలిన స్థావరాలను కూడా భారత్ స్వాధీనం చేసుకోవడంతో ఆపరేషన్ విజయవంతమైందని నాటి భారత ప్రధాని వాజ్‌పేయీ జులై 14న ప్రకటించారు. పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ జులై 26న ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: కళ్లజోళ్లూ ఇవ్వలేరా?ముద్దు పెడుతూ.. పలకరిస్తే సరిపోతుందా?
-
Crime News
Crime News: పొట్టిగా ఉన్నందున పెళ్లి కావట్లేదని ఆత్మహత్య
-
Ap-top-news News
AP-Adani Group: షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు.. ఇదో భారీ కుంభకోణం
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు