మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్‌!

అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది.

Updated : 19 Feb 2023 04:46 IST

తుర్కియే ఇచ్చిన సామగ్రిని వారికే పంపించడంతో విమర్శలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది. అన్ని దేశాలలాగే తుర్కియేలోని భూకంప బాధితులకు పాకిస్థాన్‌ ఇటీవల తన వంతుగా సహాయ సామగ్రిని పంపించింది. అనంతరం ఆ సాయాన్ని చూసి ఆశ్చర్యపోవడం తుర్కియే అధికారుల వంతైంది. గతంలో పాక్‌కు తమ దేశం అందించిన వరద సాయాన్ని అలాగే ప్యాక్‌ చేసి తిరిగి తమకే పంపించిందని గుర్తించి వారు కంగుతిన్నారు. దీంతో పాక్‌ తీరుపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది పాకిస్థాన్‌లో భీకర వరదలు వచ్చినపుడు తుర్కియే సహాయక సామగ్రిని పంపింది. ఇప్పుడు అదే సామగ్రిని పాక్‌ మరోసారి ప్యాకింగ్‌ చేసి అంకారాకు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పైన కొత్త బాక్సులను ఉంచిన పాక్‌.. లోపల ఉన్న బాక్సులను మార్చడం మర్చిపోయింది. బయటి బాక్సులపైన.. ‘‘భూకంప బాధితుల కోసం పాకిస్థాన్‌ ప్రజలు పంపిన సాయం’’ అని రాసి ఉంది. లోపల ఉన్న బాక్సుల్లో మాత్రం.. ‘‘వరదల్లో అల్లాడుతున్న పాక్‌ ప్రజలకు సాయం అందించేందుకు తుర్కియే ప్రజలు పంపుతున్న సామగ్రి ఇది’’ అని రాసి ఉండటంతో పాక్‌ గుట్టు బయటపడింది. తుర్కియేకు పంపిన ఈ సాయాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని తుర్కియే కాన్సులేట్‌ జనరల్‌ పాక్‌ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

చర్చనీయాంశమైన పాక్‌ ప్రధాని తుర్కియే పర్యటన

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తుర్కియే పర్యటన చర్చనీయాంశంగా మారింది. భూకంపం సంభవించిన రెండు రోజుల తర్వాత షరీఫ్‌, పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ ఆ దేశానికి వెళ్లాలనుకున్నారు. అయితే భూకంప సహాయక చర్యల్లో తాము తీరిక లేకుండా ఉన్నందున ఆ పర్యటనను వాయిదా వేసుకోవాలని తుర్కియే ప్రభుత్వం పాక్‌కు సూచించింది. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో విదేశీ పర్యటనలకు వెళ్తారా? అంటూ పాక్‌ ప్రజలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అయినప్పటికీ.. షెహబాజ్‌  రెండు రోజుల క్రితం తుర్కియే వెళ్లి బాధితులను పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని