Africa: కొత్త ఖండం పుడుతోంది!

ప్రపంచ పటం మారబోతోందా? ఖండాలెన్నంటే ఏడుకాదు ఎనిమిదని చెప్పేకాలం రాబోతోందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు.

Updated : 24 Mar 2023 15:15 IST

రెండుగా విడిపోనున్న ఆఫ్రికా
సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయి

ప్రపంచ పటం మారబోతోందా? ఖండాలెన్నంటే ఏడుకాదు ఎనిమిదని చెప్పేకాలం రాబోతోందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత ఆఫ్రికా ఖండం కొన్ని వేల ఏళ్లలో రెండుగా చీలబోతోందని... వాటి మధ్య సరికొత్త సముద్రం ఏర్పడబోతోందని... ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు భూమి లోపలా, మీదా మొదలయ్యాయంటున్నారు భూగర్భ నిపుణులు!

భూభాగం నిరంతరం మారుతూనే వస్తోంది. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు. వీటికి సహజంగానే కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో చోటుచేసుకోబోతోంది. ఆఫ్రికా రెండుగా చీలి రెండు ఖండాలుగా ఏర్పడబోతోంది. ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా ఓ సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలున్నాయి. ఈ మార్పునే శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా పేర్కొంటున్నారు.


  ఏమిటీ పగులు?

భూగర్భంలోని ఒక పలక (టెక్టానిక్‌ ప్లేట్‌) రెండుగా విడిపోవటాన్ని శాస్త్రవేత్తలు చీలికగా పరిగణిస్తారు. ఈ పలకలు (టెక్టానిక్‌ ప్లేట్లు) కదలటం ఆరంభమైనప్పుడు లోయలాంటి పగుళ్లు భూ ఉపరితలంపైనా, భూగర్భంలోనూ ఏర్పడతాయి. 138 మిలియన్‌ సంవత్సరాల కిందట ఇలాంటి పరిణామం వల్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. 2005లోనే ఇథియోపియా ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవునా భారీ పగులు సంభవించింది. 2018లో కెన్యాలోనూ ఇలాంటిదే భారీ పగులు కనిపించింది. సముద్రం కిందిభాగంలో పలకల కదలికల కారణంగానే ఇది సంభవించిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆఫ్రికన్‌ నుబియన్‌, ఆఫ్రికన్‌ సొమాలి, అరేబియన్‌ అనే పలకల వద్ద పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంకేతంగా భావిస్తున్నారు. ‘‘భూగర్భంలో మొదలయ్యే పగులు.. ఉపరితలం మీదిదాకా చేరి... సముద్ర ఆవిర్భావానికి కారణం కాబోతోంది’’ అని లీడ్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు క్రిస్టఫర్‌ మూర్‌ తెలిపారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, ఎర్రసముద్రంలోని నీరే ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా రూపుదాలుస్తుందంటున్నారు.


వేల కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ చీలిక కారణంగా... ప్రస్తుత సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలో కొన్ని ప్రాంతాలు కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది.


అలాగని ఆఫ్రికా ఇప్పటికిప్పుడు రెండుగా చీలబోదు. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ పూర్తవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కొత్త సముద్రం ఆవిర్భవించటానికి 5-10 మిలియన్‌ సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు సముద్రం లేని ఉగాండా, జాంబియాలకు తీరప్రాంతం వస్తుంది. ‘‘చీలికలోయలో తూర్పుభాగంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రూపుదాల్చటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది’’ అని నైరోబీ విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్ర విభాగం పరిశోధకుడు ఎడ్విన్‌ డిండి వివరించారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని