65 వేల హెచ్‌1బీ వీసాల రిజిస్ట్రేషన్లు పూర్తి

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల సమాఖ్య ఏజెన్సీ గణాంకాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్‌1బీ వీసా దరఖాస్తులకు ఈ - రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

Updated : 29 Mar 2023 09:16 IST

వాషింగ్టన్‌: అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల సమాఖ్య ఏజెన్సీ గణాంకాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్‌1బీ వీసా దరఖాస్తులకు ఈ - రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాగా పరిగణించే హెచ్‌1బీ అమెరికన్‌ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో, సాంకేతిక నైపుణ్యం అవసరమున్న పనుల్లో విదేశీ అభ్యర్థులను చేర్చుకునేందుకు అనుమతిస్తుంది. భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకునే ఈ కేటగిరీ అభ్యర్థులపై అమెరికన్‌ సాంకేతిక కంపెనీలు ఆధారపడుతుంటాయి. యూఎస్‌ కాంగ్రెస్‌ విధించిన పరిమితి మేర ఖరారు చేసిన 65 వేల వీసాల్లో ఉపయోగించనివాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి అర్హమైనవిగా పరిగణిస్తారు. హెచ్‌1బీ వీసాలకు ఉన్న అధిక డిమాండు దృష్ట్యా జారీ ప్రక్రియలో సంస్కరణల కోసం ఎప్పటినుంచో అభ్యర్థనలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల సంఖ్యను పెంచాలని, దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. సాంకేతికంగా, ఆవిష్కరణల పరంగా నేడు ప్రపంచస్థాయిలో తనకున్న ఉన్నతస్థానాన్ని అమెరికా నిలబెట్టుకోవాలంటే హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియ చాలా కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి.


60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది అవాస్తవం

సాంకేతికరంగంలో కొనసాగుతున్న తొలగింపుల నేపథ్యంలో హెచ్‌1బీ వీసా ఉండీ, తొలగింపునకు గురైన ఉద్యోగులు 60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది వాస్తవం కాదని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల సమాఖ్య ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇటువంటి ఉద్యోగులకు అమెరికాలో కొనసాగేందుకు బహుళ అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ఫౌండేషన్‌, భారత వలసల అధ్యయన కేంద్రానికి యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఓ లేఖ రాస్తూ.. ‘‘ముఖ్యంగా సాంకేతికరంగంలో అసంకల్పిత తొలగింపుల సమస్య తీవ్రత మాకు తెలుసు. బాధిత కుటుంబాల ఆర్థిక, భావోద్వేగ పరమైన సమస్యలను అర్థం చేసుకోగలం’’ అని తెలిపారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమేజాన్‌ వంటి కంపెనీలు ఈ మధ్య వరుసగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ‘‘వాషింగ్టన్‌ పోస్ట్‌’’ కథనం మేరకు.. గతేడాది నవంబరు నుంచి రెండు లక్షల ఐటీ ఉద్యోగులను తొలగించారు. ఇందులో 30 నుంచి 40 శాతం మేర హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలున్న భారతీయ ఐటీ నిపుణులే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా నిబంధనల మేరకు 60 రోజుల్లోపు.. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ హోదా మార్పునకు లేదా హోదా సర్దుబాటునకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. అలాగే ‘బలవంతపు పరిస్థితులు’ సూచించే ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా యజమానిని మార్చే దరఖాస్తు ద్వారా లబ్ధి పొందవచ్చు. అరవై రోజుల్లోపు ఇందులో ఏ ఒక్క దరఖాస్తు చేసినా మరో 60 రోజులపాటు ఇక్కడే ఉండే వెసులుబాటు లభిస్తుంది. ఇందులో ఏ దరఖాస్తు చేయనివారు మాత్రమే గడువు ముగిసిన వెంటనే అమెరికా వీడాల్సి ఉంటుందని యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ తన లేఖలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు