స్వీడన్‌ చేరికకు అంగీకరించండి

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో స్వీడన్‌ చేరికకు మార్గం సుగమం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Published : 02 Jun 2023 04:49 IST

తుర్కియేపై ఒత్తిడి పెంచనున్న నాటో

ఓస్లో: ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో స్వీడన్‌ చేరికకు మార్గం సుగమం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. స్వీడన్‌కూ సభ్యత్వం మంజూరు చేసేందుకు నాటోలో మెజార్టీ దేశాలు సుముఖంగా ఉన్నా.. ప్రధానంగా తుర్కియే నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థల విషయంలో స్వీడన్‌ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే తుర్కియేను ఒప్పించి వీలైనంత త్వరగా స్వీడన్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని నాటో భావిస్తోంది. ఇందుకోసం అంకారాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా త్వరలోనే తాను తుర్కియేలో పర్యటించనున్నట్లు కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ గురువారం తెలిపారు. నాటో సభ్యదేశాల అధినేతలు లిథువేనియా వేదికగా జులై 11-12 తేదీల్లో సమావేశం కానున్నట్లు చెప్పారు. అప్పట్లోగా స్వీడన్‌ చేరికకు మార్గం సుగమం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగిశాక ఉక్రెయిన్‌ భద్రతకు భరోసా ఇచ్చేలా, ఆ దేశానికి మరింత సాయం చేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపైనా కూటమి దృష్టిసారించినట్లు స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని