పగడపు దిబ్బలకు వేడి సెగ!

సముద్ర జలాలు వేడెక్కడం పగడపు దిబ్బల ఉనికికి చేటు తెస్తోంది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట దక్షిణ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత జులై నెల మధ్యలో కూడా 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

Published : 16 Jul 2023 04:47 IST

కొంపముంచుతున్న భూతాపం

వాషింగ్టన్‌: సముద్ర జలాలు వేడెక్కడం పగడపు దిబ్బల ఉనికికి చేటు తెస్తోంది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట దక్షిణ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత జులై నెల మధ్యలో కూడా 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. దక్షిణ అమెరికా ఖండంలోనూ, మధ్య అమెరికా దేశాల్లోనూ కూడా ఇదే పరిణామం సంభవిస్తూ పగడపు దిబ్బలపై దుష్ప్రభావం చూపుతోంది. అట్లాంటిక్‌, తూర్పు పసిఫిక్‌ మహాసముద్ర జలాలూ తీవ్రంగా వేడెక్కడం పగడపు దిబ్బలకు అనర్థాన్ని తెస్తోంది. మనుషుల్లానే పగడపు దిబ్బలూ అతి వేడిని తట్టుకోలేవు. సముద్ర జలాలు వేడెక్కడానికి ఈ ఏడాది ఎల్‌నినో కారణమైనా దీర్ఘకాలంలో మానవ కార్యకలాపాల వల్ల భూతాపం పెరిగి ఇబ్బందులకు కారణమవుతోంది.

సముద్రాల్లో పగడపు దిబ్బలు భూమిపై అమెజాన్‌ వర్షాధార అడవుల తరహాలో అపార జీవ వైవిధ్యానికి నెలవులు. అవి చేపలు, రొయ్యలు తదితర జలచరాలకు ఆహారం అందిస్తాయి. మనోహరమైన పగడపు దిబ్బలను వీక్షించడానికి పర్యాటకులు సముద్రాల్లో స్కూబా డైవింగ్‌ చేస్తారు. అక్కడ చేపల వేట జోరుగా సాగుతుంది. ఇలా పర్యాటక రంగం ద్వారా తీర దేశాలకు ఏటా వందల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. పగడపు దిబ్బలు తుపానుల సమయంలో భీకర అలల ధాటిని తగ్గిస్తూ తీరంలోని భవనాలు, ఇతర మౌలిక వసతులను రక్షిస్తాయి.

పగడపు దిబ్బల్లో నివసించే జూక్సాంథెల్లే సూక్ష్మ నాచు (ఆల్గే) అచ్చం మొక్కల్లానే కిరణజన్య సంయోగ క్రియ జరుపుతూ జలచరాలకు ఆహారాన్ని అందిస్తాయి. తమ చుట్టూ సముద్రపు నీరు వేడెక్కితే జాక్సాంథెల్లే ఆల్గే ఆ దిబ్బలను విడచివెళ్లిపోతాయి. దీంతో పగడపు దిబ్బలు ఎరుపు రంగు కోల్పోయి తెల్లగా మారిపోతుంది. దీన్నే బ్లీచింగ్‌ అంటారు. ఫ్లోరిడా కీస్‌ తీర జలాల్లో 90 శాతం దిబ్బల్లో బ్లీచింగ్‌ కనిపిస్తోంది. కొలంబియా, మెక్సికో, కోస్టారికా దేశాల తీరాల్లోనూ పగడపు దిబ్బల బ్లీచింగ్‌ సంభవిస్తోంది. సముద్ర జలాలు వేడెక్కుతున్న కొద్దీ జూక్సాంథెల్లే సూక్ష్మ నాచు జీవులు పగడు దిబ్బలను వదలివేయడం ఎక్కువై వినాశం సంభవిస్తుంది.

దీన్ని నివారించడమెలా అని అమెరికాలో పరిశోధనలు సాగుతున్నాయి. ఆటుపోట్ల వల్ల సముద్ర తీరంలో ఏర్పడే నీటి చెలమల్లో పగడపు దిబ్బలు వేర్వేరు ఉష్ణోగ్రతలను చవిచూస్తూ కూడా జీవిస్తున్నాయి. ఈ ప్రక్రియను ప్రయోగశాలలో కూడా పునరావృతం చేయగలమా అని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అలా ప్రయోగశాలలో పెంచిన పగడపు జీవులను సముద్రంలో ప్రవేశపెడితే అవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు