ఇమ్రాన్‌కు జైలు.. అరెస్టు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా (ప్రభుత్వ బహుమతులను అక్రమంగా అమ్మకం) కేసులో శనివారం ఇస్లామాబాద్‌ స్థానిక కోర్టు ఈ మాజీ క్రికెటర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది.

Published : 06 Aug 2023 05:02 IST

అటక్‌ జైలుకు తరలింపు
తోషాఖానా కేసులో మూడేళ్ల కారాగార శిక్ష  విధించిన న్యాయస్థానం
ఎన్నికల వేళ.. పాక్‌ మాజీ ప్రధానికి భారీ ఎదురుదెబ్బ
తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసిన పీటీఐ

ఇస్లామాబాద్‌/లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా (ప్రభుత్వ బహుమతులను అక్రమంగా అమ్మకం) కేసులో శనివారం ఇస్లామాబాద్‌ స్థానిక కోర్టు ఈ మాజీ క్రికెటర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైల్లో గడపాల్సి ఉంటుందని పేర్కొంది. దోషిగా నిర్ధారణ కావడంతో పాక్‌ రాజ్యాంగం ప్రకారం ఇమ్రాన్‌ ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇస్తే మాత్రం అనర్హత వేటు తొలగుతుంది. ఈ నెల 9న పాక్‌ జాతీయ అసెంబ్లీని రద్దుచేసి, ఎన్నికలు జరిపించాలని కోరతానని ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ తీర్పు పీటీఐకి భారీ ఎదురుదెబ్బే. ఇస్లామాబాద్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు అదనపు జడ్జి హుమయూన్‌ దిలావర్‌ తీర్పు ప్రకటించగానే 70 ఏళ్ల ఇమ్రాన్‌ను లాహోర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అటక్‌ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో పీటీఐ మద్దతుదారులు గతంలోలా తీవ్రంగా ప్రతిఘటించలేదు. మే 9న అల్‌-ఖదీర్‌ కేసులో ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ భవనాలపై భారీస్థాయిలో ఆయన మద్దతుదారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. న్యాయం హత్యకు గురైందని ఇమ్రాన్‌ న్యాయవాది విమర్శించారు. తమ నాయకుడి అరెస్టును పీటీఐ తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. తీర్పును లాహోర్‌ హైకోర్టులో సవాల్‌ చేసింది. తుపాకీతో బెదిరించి ఇమ్రాన్‌ఖాన్‌ను 200 మంది పంజాబ్‌ పోలీసులు కిడ్నాప్‌ చేశారని ఆ పిటిషన్‌లో ఆరోపించింది.

ఏమిటీ తోషాఖానా కేసు..!

తోషాఖానా కేసు గతేడాది వెలుగులోకి వచ్చింది. విదేశీ నేతలు, అధికారుల నుంచి పాక్‌ అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, సైనికాధికారులకు లభించిన బహుమతులను భద్రపరిచే ప్రభుత్వ ఖజానాను తోషాఖానా అంటారు. ఎవరు ఏ విలువైన వస్తువును స్వీకరించినా..ఇక్కడ అప్పగించాల్సిందే. ఒక వేళ తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటే తగిన ధర చెల్లించాలి. ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన 58 బహుమతులు లభించాయి. వీటిలో చాలా వస్తువులను ఆయన   తన దగ్గరే ఉంచుకున్నారని.. కొన్నింటికే నామమాత్ర ధర చెల్లించారని పీటీఐ పార్టీ అధినేతపై అభియోగం.    కొన్నింటిని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆదాయ వివరాలను ఎన్నిక ప్రమాణ పత్రంలో చూపించలేదని, ఇది అవినీతేనంటూ పాక్‌ ఎన్నికల సంఘం.. గతేడాది అక్టోబరులో ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఫిర్యాదు కూడా చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడు శిక్ష పడింది.


అయినా స్వీప్‌ చేస్తాం: ఇమ్రాన్‌

తనను అరెస్టు చేసినా.. రానున్న ఎన్నికల్లో పీటీఐ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఇమ్రాన్‌ అన్నారు. ‘‘ఎన్నికలు స్వీప్‌ చేస్తామని సైన్యం, ప్రభుత్వం భయపడుతున్నాయి. అందుకే మే 9న జరిగిన ఘర్షణల సాకుతో మా పార్టీని  అణగదొక్కాలని చూశారు’’ అని అరెస్టుకు ముందు పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఓ వీడియోను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని