Covid 19: కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో వైరస్‌ నిరోధకతలో హెచ్చుతగ్గులు

ఒకసారి కొవిడ్‌ వచ్చి కోలుకున్న వారిలో, కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిలో సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ను నిరోధించే సత్తా ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.

Updated : 24 Aug 2023 05:46 IST

దిల్లీ: ఒకసారి కొవిడ్‌ వచ్చి కోలుకున్న వారిలో, కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిలో సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ను నిరోధించే సత్తా ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే. కానీ, ఆ తరవాత పెద్ద సంఖ్యలో కొవిడ్‌ వైరస్‌ల తాకిడికి గురైతే రోగనిరోధక శక్తి తగ్గడమో, నశించడమో జరుగుతుందని అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలో యేల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన అధ్యయనం తేల్చింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరం పాటింపుతో పాటు గాలీవెలుతురూ ధారాళంగా ప్రసరించే ఏర్పాటూ అవసరమని నేచర్‌ పత్రికలో ప్రచురితమైన నివేదిక సూచించింది. పరిశోధకులు కనెక్టికట్‌ రాష్ట్ర జైళ్లలోని 15,444 మందిపై 2021 జూన్‌- 2022 మే నెల మధ్య అధ్యయనం జరిపారు. ఆ కాలంలోనే డెల్టా, ఒమిక్రాన్‌ వైరస్‌లు విజృంభించాయి. ఇంతకుముందే వైరస్‌ సోకిన వారు, టీకా వేయించుకున్న వారు, లేక కొవిడ్‌ వచ్చి నయమై, టీకా కూడా వేయించుకున్న వారు (హైబ్రిడ్‌) జైలులో కొవిడ్‌ బాధితులతో కలసి ఉన్నప్పుడు వారి రోగనిరోధక శక్తి బలహీనపడిందని గుర్తించారు. అయితే, అందరిలోకీ హైబ్రిడ్‌ వర్గం వారిలో వైరస్‌ను నిరోధించే శక్తి ఎక్కువగా ఉందని తేల్చారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి సమయంలో కొవిడ్‌ పీడితులతో కలసి జైలులో ఉన్న వారిలో హైబ్రిడ్‌ నిరోధకత 20 శాతం మాత్రమే. కొవిడ్‌ లేనివారితో కలసి గదిలో ఉన్నవారిలో హైబ్రిడ్‌ నిరోధక శక్తి 76 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని