సంక్షిప్త వార్తలు (4)

జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీలను ఏప్రిల్‌ 4వ తేదీన కోర్టులో హాజరుపరచాలని అధికారులను జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి తాహిర్‌ అబ్బాస్‌ ఆదేశించారు.

Updated : 26 Mar 2024 05:23 IST

ఇమ్రాన్‌ దంపతులను 4న హాజరుపరచండి
పాక్‌ కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌: జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీలను ఏప్రిల్‌ 4వ తేదీన కోర్టులో హాజరుపరచాలని అధికారులను జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి తాహిర్‌ అబ్బాస్‌ ఆదేశించారు. వారిద్దరూ పలు కేసుల్లో బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లు ఆ రోజున విచారణకు రానున్నాయి. ఖాన్‌ను వీడియో సమావేశంద్వారా హాజరుపరచడంలో అడియాలా జైలు అధికారులు విఫలమైన నేపథ్యంలో జడ్జి ఈ ఆదేశాలిచ్చారు.


సింగపూర్‌ మాజీ మంత్రి ఈశ్వరన్‌పై కొత్త కేసులు

సింగపూర్‌: భారత సంతతికి చెందిన సింగపూర్‌ మాజీ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ (61)పై సోమవారం కొత్తగా ఎనిమిది అవినీతి ఆరోపణలు దాఖలయ్యాయి. జనవరిలో మోపిన 27 అభియోగాలతో కలుపుకొని మొత్తం 35 ఆరోపణలను ఈశ్వరన్‌ ఎదుర్కొంటున్నారు. కోర్టు అనుమతితో ఆస్ట్రేలియాకు వెళ్లివచ్చిన వారం రోజులకే ఈశ్వరన్‌పై కొత్త ఆరోపణలు దాఖలయ్యాయి. లుమ్‌ కోక్‌ సంగ్‌ అనే బిల్డర్‌ నుంచి ఖరీదైన విస్కీ సీసాలు, గోల్ఫ్‌ సాధనాలు, సైకిల్‌ను లంచంగా తీసుకున్నట్లు ఈశ్వరన్‌పై తాజా ఆరోపణలు వచ్చాయి. ఆయన గతంలో ఆంగ్‌ బెంగ్‌ సెంగ్‌ అనే మరో బిల్డర్‌ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలన్నింటిలో తాను నిర్దోషినని ఈశ్వరన్‌ వాదిస్తున్నారు.


పోలండ్‌ సమన్లను పట్టించుకోని రష్యా రాయబారి

వార్సా: ఓ క్రూజ్‌ క్షిపణి రష్యా నుంచి తమ గగనతలంలోకి రావడంపై నిరసన తెలిపేందుకు రావాల్సిందిగా పోలండ్‌ పంపిన సమన్లను రష్యా రాయబారి పట్టించుకోలేదు. ఉక్రెయిన్‌పైకి పంపిన క్షిపణుల్లో ఒకటి ఆదివారం తెల్లవారుజామున తమ గగనతలంలో 39 సెకెన్లపాటు వెళ్లడంపై పోలండ్‌ అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. నిరసన లేఖను అధికారికంగా అందజేసేందుకు రష్యా రాయబారి సెర్గే ఆండ్రీవ్‌ను పిలిపించాలని పోలండ్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రయత్నించింది. ఆయన దీనికి హాజరుకాలేదని, పోలండ్‌లో రష్యా ప్రయోజనాలను తగిన రీతిలో కాపాడగలరా అనే ఆశ్చర్యం కలిగిందని ఈ శాఖ ప్రతినిధి విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. ఒక దేశంలో రాయబారిగా ఉన్నవారు ఏయే విధులు నిర్వర్తించాలో వియన్నా ఒప్పందంలో స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ క్షిపణి ఉదంతం గురించి నాటో సెక్రటరీ జనరల్‌కు సోమవారం ఫోన్‌ద్వారా వివరించినట్లు పోలండ్‌ తెలిపింది.


నావల్నీ మరణం తర్వాత.. ప్రమాదంలో రాజకీయ ఖైదీల జీవితాలు

 పుతిన్‌ విమర్శకుడు కారా-ముర్జా సతీమణి ఎవ్జెనియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం అక్కడి విమర్శకుల్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. నావల్నీ మరణం తర్వాత రష్యాలో రాజకీయ ఖైదీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని వ్లాదిమిర్‌ కారా-ముర్జా అనే పుతిన్‌ విమర్శకుడి భార్య ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలో నిరంకుశ పాలనను వ్యతిరేకించిన ఎంతోమంది కటకటాలపాలయ్యారని కారా-ముర్జా భార్య ఎవ్జెనియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫ్రీ రష్యా ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ సలహాదారుగా ఉన్న ఆమె.. పుతిన్‌ పాలనను వ్యతిరేకిస్తోన్న తన భర్తతో పాటు అలెగ్జాండ్రా స్కోచిలెంకో, అలెక్సీ గోరినోవ్‌ తదితర ఎంతోమంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. గతంలో రెండుసార్లు హత్య చేయడానికి యత్నించిన వారి చేతుల్లోనే తన భర్త బందీగా ఉన్నట్లు వాపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని కారా-ముర్జా వ్యతిరేకిస్తున్నారు. మాస్కోపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించేందుకు ఆయన లాబీయింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజద్రోహంతో పాటు ఇతర కేసుల్లో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన తర్వాత ఓ ప్రతిపక్ష నాయకుడికి మాస్కో విధించిన శిక్షల్లో అత్యంత కఠినమైంది ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని