డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌ ఎలా అడ్డుకుందంటే..

దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల దాడికి గురైతే ఏ దేశమైనా అల్లాడిపోతుంది. ఇజ్రాయెల్‌ మాత్రం సునాయాసంగా వాటిని నేలకూల్చింది.

Updated : 15 Apr 2024 06:03 IST

టెల్‌ అవీవ్‌: దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల దాడికి గురైతే ఏ దేశమైనా అల్లాడిపోతుంది. ఇజ్రాయెల్‌ మాత్రం సునాయాసంగా వాటిని నేలకూల్చింది. ఇందుకు కారణం ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే. ఇందులో ఏం ఉన్నాయంటే..!

ది యారో: ఇది అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ. బాలిస్టిక్‌ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్‌ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ యారో వ్యవస్థతోనే ఇజ్రాయెల్‌ అడ్డుకుంటోంది.

డేవిడ్‌ స్లింగ్‌: ఇది కూడా అమెరికా తయారుచేసిందే. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్‌ నుంచి హెజ్‌బొల్లా ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్‌ ఎక్కువగా వినియోగిస్తోంది.

పేట్రియాట్‌: ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌ చాలా కాలం నుంచి వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్‌ యుద్ధంలో వీటి పేరు మార్మోగిపోయింది. ఇరాక్‌ ప్రయోగించిన స్కడ్‌ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలను, డ్రోన్లు కూల్చడానికి ఇజ్రాయెల్‌ వినియోగిస్తోంది.

ఐరన్‌ డోమ్‌: అమెరికా సహకారంతో ఇజ్రాయెల్‌ తయారుచేసిన వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్‌ హెజ్‌బొల్లా, గాజా నుంచి హమాస్‌ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది. శత్రుపక్షం రాకెట్లు ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఐరన్‌ బీమ్‌: ఇజ్రాయెల్‌ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్‌ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చౌక. ఇరాన్‌ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్‌ వ్యవస్థను వాడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు