Germany: వలసదారులకు ఐదేళ్లకే పౌరసత్వం..! సంస్కరణలకు జర్మనీ ఆమోదం

పౌరసత్వ కల్పన విషయంలో జర్మనీ సంస్కరణల బాటపట్టింది. కొత్త చట్టం ప్రకారం స్థానికంగా ఐదేళ్లుగా నివసిస్తోన్నవారు పౌరసత్వం పొందేందుకు అర్హులు.

Published : 20 Jan 2024 01:46 IST

బెర్లిన్‌: వలసల సంఖ్యను పెంచేందుకు జర్మనీ (Germany) సిద్ధమైంది. దేశ పౌరసత్వం (German Citizenship), ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షల సడలింపు దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన ప్రణాళికను చట్టసభ్యులు ఆమోదించారు. ఓలాఫ్ షోల్జ్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు పార్లమెంటు (Bundestag)లో 382- 234 ఓట్ల తేడాతో నెగ్గింది. ఈ సంస్కరణలు వలసదారుల ఏకీకరణను ప్రోత్సహిస్తాయని, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుత చట్టం ప్రకారం.. జర్మనీలో ఎనిమిదేళ్లు నివసిస్తేనే పౌరసత్వం పొందేందుకు అర్హులు. ప్రత్యేక సందర్భాల్లో ఐదేళ్లకు అవకాశం కల్పిస్తారు. తాజాగా దీన్ని ఐదేళ్లు, మూడేళ్లకు తగ్గించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు స్థానికంగా ఎనిమిదేళ్లుగా చట్టబద్ధంగా నివాసం ఉంటే.. ఇక్కడ జన్మించే పిల్లలు పుట్టుకతో జర్మనీ పౌరులుగా మారతారు. నూతన ప్రణాళికలో దీన్ని ఐదేళ్లకు తగ్గించారు. ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ మినహా ఇతర దేశాల పౌరులు జర్మనీ పౌరసత్వం పొందినప్పుడు వారి మునుపటి జాతీయతను వదులుకోవాల్సి వచ్చేది. కొన్ని మినహాయింపులు ఉండేవి. ఇప్పుడు ఈ ఆంక్షలు తొలగిపోనున్నాయి.

ఉచిత విద్యకు చలో జర్మనీ! 

జర్మనీ 8.44 కోట్ల జనాభాలో 1.2 కోట్ల మందికి స్థానిక పౌరసత్వం లేదు. వారిలో 53 లక్షల మంది దాదాపు పదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2022లో దాదాపు 1.68 లక్షల మందికి పౌరసత్వం లభించింది. ‘‘తాజా సంస్కరణలు జర్మనీని ఫ్రాన్స్‌ వంటి పొరుగు దేశాలకు పోటీగా నిలుపుతాయి. నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మేం కూడా కెనడా, అమెరికాల మాదిరి ఆఫర్లు అందించాలి. పౌరసత్వం కూడా ఇందులో ఒక భాగమే’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రి నాన్సీ ఫేజర్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని