Hamas: కాల్పుల విరమణపై చర్చలు నిలిపివేసిన హమాస్‌

సలేహ్‌ అరౌరీపై దాడితో హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కాల్పుల విరమణపై చర్చలు నిలిచిపోయాయి. 

Updated : 03 Jan 2024 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ సంస్థ అగ్రనేత సలేహ్‌ అరౌరీని ఇజ్రాయెల్‌ డ్రోన్‌ మట్టుపెట్టడంపై హమాస్‌ (Hamas) ఆగ్రహంగా ఉంది. గాజాలో మిగిలిన బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేసింది. ఈ విషయాన్ని అల్‌ అరేబియా వార్తా సంస్థ పేర్కొంది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా స్పందిస్తూ.. అరౌరీ హత్యను ఉగ్ర చర్యతో పోల్చారు. లెబనాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్‌ ధిక్కరించిందన్నారు. ఈ దాడికి ముందు.. హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య డీల్‌ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. ఇప్పటికీ హమాస్‌ చెరలో 129 మంది ఉన్న విషయం తెలిసిందే.

వేల భవనాలు, కార్లు ధ్వంసం

బందీల కుటుంబీకులు మంగళవారం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కలిసి హమాస్‌తో ఒప్పందం కోసం ఒత్తిడి చేశారు. తాము ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని.. వీటికి తుది గడువు విధించలేదని ఇజ్రాయెల్‌ ప్రధాని అన్నారు.

ఎవరీ సలేహ్‌ అరౌరీ..?

సలేహ్‌ అరౌరీ హమాస్‌ అల్‌-కస్సం బ్రిగేడ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్‌ చేపట్టిన ఈ డ్రోన్‌ దాడి.. 2006 తర్వాత అతిపెద్దది. ఇజ్రాయెల్‌ బయట కూడా హమాస్‌ నాయకత్వాన్ని వేటాడుతామని నెతన్యాహు ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగానే ఈ దాడి జరిగింది. దీనిని లెబనాన్‌ ప్రధాని నజీబ్‌ మికాటి ఖండించారు. తమ దేశాన్ని సంక్షోభంలోకి లాగేందుకు జరిగిన దాడిగా అభివర్ణించారు. సలేహ్‌ అరౌరీ 2010 నుంచి హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు. ఈ సంస్థ ఉపనేతగా  2017లో ఎన్నికయ్యాడు. ఇజ్రాయెల్‌ సైనికుడు గిలాద్‌ షలిట్‌ అప్పగింత ఒప్పంద చర్చల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇరాన్‌-హమాస్‌ మధ్య సంబంధాల బలోపేతంలో అరౌరీ పాత్రే చాలా కీలకం. అతడి మరణం ఒక రకంగా ఇరాన్‌కూ ఇబ్బందికరమే. 2015లో అరౌరీని అమెరికా గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా పేర్కొంది. అతడి సమాచారం అందిస్తే 5 మిలియన్‌ డాలర్ల బహుమతిని ప్రకటించింది. బీరుట్‌లో అరౌరీపై డ్రోన్‌ దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్‌ గోప్యంగా ఉంచింది. తన మిత్రదేశమైన అమెరికాతో కూడా ముందుగా పంచుకోలేదు.

అల్‌-షిఫాను కమాండ్‌ సెంటర్‌గా వాడారు.. 

గాజాలోని అల్‌-షిఫా హాస్పిటల్‌ను హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థలు కమాండ్‌ సెంటర్‌గా వాడుకొన్నాయని అమెరికా ధ్రువీకరించింది. డీక్లాసిఫైడ్‌ అమెరికా ఇంటెలిజెన్స్‌ సమాచారం దీనిని వెల్లడించింది. హమాస్‌, పీఐజే సంస్థలు ఇక్కడ బందీలను దాచినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌ దళాలు దీనిలో ప్రవేశించడానికి ముందు వారిని తరలించినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని