Srilanka Crisis: శ్రీలంక సర్కార్‌ మెడపై అవిశ్వాసం కత్తి.. రాజీనామా రద్దు చేసుకున్న ఆర్థికమంత్రి!

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని.......

Published : 09 Apr 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం రాజపక్స ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనం చెప్పేది వినకపోతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పలు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, మంత్రి పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన రాజీనామా రద్దు చేసుకున్నట్టు ఆర్థిక మంత్రి అలీ సాబ్రే స్పష్టంచేశారు. శ్రీలంకలో ఈరోజు జరిగిన కొన్ని కీలక పరిణామాలివీ..

  1. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రభుత్వం ప్రజలు చెప్పింది వినకపోతే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస హెచ్చరించారు. ఓట్లు వేసి గెలిపించిన జనాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ప్రజల వద్దకు ఎలా తిరిగి వెళ్లగలరో నిర్ణయించుకోండని ప్రభుత్వానికి సూచించారు. 
  2. ఔషధాల కొరత శ్రీలంకను వేధిస్తుండటంతో అక్కడ ఆరోగ్య వ్యవస్థ కుదేలైంది. ఆస్పత్రుల్లో తగిన మందుల్లేకపోవడంతో దేశంలోని పలు చోట్ల వైద్యులు, నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రత్మలానాలో స్టేట్‌ ఫార్మాస్యూటికల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. మందుల కొరతను తీర్చేందుకు తక్షణమే పరిష్కారం కనుగొనాలని డిమాండ్‌ చేస్తున్నారు.
  3. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు 500 మిలియన్‌ డాలర్ల విలువైన చమురును లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌గా భారత్‌ అందిస్తుండగా.. దీన్ని శ్రీలంక వేగంగా వినియోగించుకుంటోంది. ఈ నెలాఖరుకు ఈ చమురు నిల్వలు కూడా తరిగిపోనున్నాయి. ఒకవేళ భారత్‌ నుంచి ఈ సహాయం కొనసాగింపు లేకపోతే శ్రీలంకలో డీజిల్‌ బంకులు మళ్లీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 
  4. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఇప్పటికీ తమ దేశ ఆర్థిక మంత్రి అలీ సబ్రీయేనని అధికార పార్టీకి చెందిన ఎంపీ కాంచన విజెశేఖర అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. అలీ సబ్రే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఇచ్చిన లేఖను అధ్యక్షుడు గొటబాయ ఆమోదించేదన్నారు. దీంతో ఆయనే ఆర్థికమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. ఇటీవల కొత్త ఆర్థిక మంత్రిగా సాబ్రే నియమితులవ్వగా.. 24గంటల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
  5. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు యూరోపియన్‌ యూనియన్‌ కీలక సూచన చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో లోతుగా చర్చించి.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన సంస్కరణలపై చర్చించాలని సూచించింది. 
  6. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి పదవి చేపట్టేందుకు ఎవరూ ఇష్టపడకపోవడంతో తన రాజీనామాను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అలీ సాబ్రే పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. అందుకే  ఎలాంటి సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడేందుకే ఆర్థికమంత్రిగా కొనసాగాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. 
  7. ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చింది. ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు వీలుగా వరల్డ్ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (WFP), ఫుడ్ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (FAO)ల ద్వారా 2.5 మిలియన్‌ డాలర్లు సమకూర్చనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 
  8. రాజపక్స సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతుగా నిలుస్తామని జేవీపీ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు విజిత హెరాత్‌ ప్రకటించారు. ప్రజల డిమాండ్‌ మేరకు అధ్యక్షుడు రాజీనామాకు నిరాకరిస్తే అభిశంసనకు కూడా వెళ్తామని హెచ్చరించారు. ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారనీ.. ప్రభుత్వం ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతుగా నిలుస్తామని వ్యాఖ్యానించారు. 
  9. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎస్‌జేబీ నిర్ణయించినట్టు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
  10. శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా మహింద సిరివర్దనె బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా, ఎకనమిక్‌ రీసెర్చి డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు