Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌ ఆ నటులను మించిపోయారు..!

ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌లోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఆయనపై జరిగిన దాడిని ఓ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. 

Updated : 07 Nov 2022 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ డ్రామా చేస్తున్నారని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. పాకిస్థాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ అధినేత మౌలాన ఫజ్లూర్‌ రెహ్మాన్‌ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై దాడిని ఓ డ్రామాగా అభివర్ణించారు. ఇమ్రాన్‌ నటనా చాతుర్యంలో.. సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లను మించిపోయారని ఎద్దేవా చేశారు. వజీరాబాద్‌ ఘటన తర్వాత తనకు ఇమ్రాన్‌పై సానుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఇమ్రాన్‌ డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌పై ఎన్ని తూటాలు కాల్చారు.. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి అన్న అంశాలపై ఆయన సందేహాలు లేవనెత్తారు. దాడి జరిగిన వెంటనే ఖాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించకుండా లాహోర్‌కు తీసుకువెళ్లడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఖాన్‌ అబద్ధాలను గుడ్డి జనం కూడా నమ్ముతున్నారని ఆయన అన్నారు. బాంబు శకలాల గురించి విన్నాం కానీ.. తూటా శకలాల గురించి ఇప్పుడే తొలి సారి వింటున్నామని ఫజ్లూర్‌ అన్నారు. అయినా బుల్లెట్‌ గాయాలకు క్యాన్సర్‌ వైద్యశాలలో చికిత్స ఎందుకు చేయించారని ప్రశ్నించారు.

పాకిస్థాన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ఇమ్రాన్‌ఖాన్‌ గతనెల 28న లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ ర్యాలీ గురువారం పంజాబ్‌ రాష్ట్రం వజీరాబాద్‌లోని అల్లాహోచౌక్‌కు  చేరుకోగా.. ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తూటా దూసుకెళ్లడంతో మాజీ ప్రధాని కాలికి గాయాలయ్యాయి. లాహోర్‌లోని షౌకత్‌ ఖనూమ్‌ ఆసుపత్రిలో వైద్య నిపుణులు ఇమ్రాన్‌కు శస్త్రచికిత్స చేశారు. ఆయన్ను ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. కాల్పులు జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని భద్రతాధికారులు నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు