Maldives: మాల్దీవుల పర్యటనకు.. భారత్‌ నుంచే ఏటా 2లక్షల మంది!

గడిచిన మూడేళ్లుగా ఏటా 2లక్షల మంది భారతీయులు మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నట్లు అక్కడి పర్యాటక శాఖ వెల్లడించింది.

Updated : 11 Jan 2024 13:51 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మాల్దీవులకు (Maldives) వచ్చే పర్యాటకుల్లో భారత్‌ నుంచే ఎక్కువగా ఉంటున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గడిచిన మూడేళ్లుగా ఏటా 2లక్షల మంది భారతీయులు మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నట్లు తేలింది. కొవిడ్‌ విజృంభణ తర్వాత ప్రపంచంలో మరే దేశం నుంచి ఈస్థాయిలో పర్యాటకులు అక్కడకు వెళ్లడం లేదట.

మాల్దీవుల పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. 2023లో 17లక్షల మంది దీవులను సందర్శించారు. వీరిలో 2,09,198లక్షల మంది భారత్‌ నుంచి రాగా.. మరో 2,09,146 మంది రష్యన్లు, 1,87,118 మంది చైనీయులు ఉన్నారు. 2022లో 2.40లక్షల మంది భారతీయులు పర్యటించగా.. 2021లో ఈ సంఖ్య 2.11లక్షలుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో కేవలం కొన్ని దేశాల పర్యాటకులను మాత్రమే మాల్దీవులు అనుమతించింది. అప్పుడు భారత్‌ నుంచి దాదాపు 63వేల మంది సందర్శించారు. 2018లో 90వేల మంది పర్యాటకులతో ఐదోస్థానంలో ఉన్న భారత్‌.. 2019 నాటికి 1.66 లక్షలకు పెరగడం గమనార్హం.

హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవుల్లో సుమారు 1200 చిన్న దీవులున్నాయి. 871 కి.మీ మేర తీరప్రాతంలో ఇవి విస్తరించి ఉన్నాయి. స్పా కేంద్రాలు మొదలు సాహస క్రీడలు, ప్రపంచస్థాయి వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇలా అనేక రకాల అనుభూతులను అందిస్తుండటంతో అంతర్జాతీయ పర్యాటకులు మాల్దీవులకు క్యూ కడుతున్నారు. అందమైన బీచ్‌లు, అందుబాటులో విమాన టికెట్‌ ధరలు ఉండటంతో భారత్‌ నుంచీ ఏటా లక్షల సంఖ్యలో మాల్దీవుల పర్యటనకు ఆసక్తి చూపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని