Iran: ఇజ్రాయెల్‌ ‘మొస్సాద్‌’తో సంబంధాలు.. నలుగురిని ఉరితీసిన ఇరాన్‌..!

Iran: ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ‘మొస్సాద్‌’తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులకు ఇరాన్‌ మరణ దండన అమలు చేసింది. మరికొంతమందిని జైలుకు పంపించింది.

Updated : 29 Dec 2023 20:34 IST

టెహ్రాన్‌: హమాస్‌ (Hamas) ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేపడుతోన్న దాడులను ఇరాన్‌ (Iran) తీవ్రంగా ఖండిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ (Israel) ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘మొస్సాద్‌ (Mossad)’కు పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులను ఇరాన్‌ శుక్రవారం ఉరితీసింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

కొంతమంది ఇరాన్‌ భద్రతా సిబ్బందిని కిడ్నాప్‌ చేసి, వారి నుంచి రహస్య సమాచారాన్ని సేకరించారని ఆ నలుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. అంతేగాక, ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లకు చెందిన కార్లు, అపార్ట్‌మెంట్లను కూడా వీరు ధ్వంసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు రుజువుకావడంతో వీరికి మరణశిక్ష అమలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, ‘మొస్సాద్‌’ సంస్థ కోసం పనిచేస్తున్న మరికొంతమంది ఏజెంట్లకు పదేళ్ల  జైలు శిక్ష విధించారు. అయితే, ఎంతమందికి జైలు శిక్ష పడిందన్న వివరాలు తెలియరాలేదు.

హౌతీ దాడులను తిప్పికొట్టి.. 18 నౌకలను కాపాడి..!

గత సోమవారం (డిసెంబరు 25) సిరియాలోని డమాస్కస్‌ నగరం సమీపంలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌కు చెందిన ఆర్మీ సలహాదారు రజీ మౌస్సావీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మొస్సాద్‌ ఏజెంట్లను ఇరాన్‌ ఉరితీయడం గమనార్హం. ఈ నెల ఆరంభంలోనూ మొస్సాద్‌కు పనిచేస్తున్న ఓ గూఢచారికి ఇరాన్‌ మరణశిక్ష అమలు చేసింది.

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొన్నేళ్లగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌ను ఇజ్రాయెల్ తన అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకునేందుకు సైనిక చర్యకూ వెనుకాడబోమని గతంలో హెచ్చరించింది. అటు ఇరాన్‌.. అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తులను నిర్బంధించి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తోంది. 2020లో ఇరాక్‌లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఓ ఇరాన్‌ జనరల్ గురించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు సమాచారాన్ని లీక్ చేసినందుకుగానూ ఓ వ్యక్తిని ఉరితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని