Attacks on ships: నౌకలపై దాడులు.. భారత ప్రయోజనాలకు ముప్పే: జైశంకర్ ఆందోళన

హిందూ మహా సముద్రంలో ఇటీవల భారత్‌కు సమీపంలో నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వీటిపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్(S Jaishankar) స్పందించారు. 

Updated : 16 Jan 2024 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మన దేశానికి సమీపంలో నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్(S Jaishankar) అన్నారు. ఈ ఘటనలు దేశ ఆర్థిక, ఇంధన ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌ పర్యటనలో ఉన్న మంత్రి.. అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఈ మేరకు స్పందించారు.

‘ఇటీవల కాలంలో హిందూ మహా సముద్రంలోని వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు పెరిగింది. భారత్‌కు సమీపంలో ఈ తరహా దాడులు జరిగాయి. ఈ పరిస్థితులు ఆందోళనకరమైనవి. ఇవి భారత్‌ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ గందరగోళ పరిస్థితి ఏ ఒక్కరికీ ప్రయోజనకరం కాదు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం అవసరం. ఇటీవల పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇండియా, ఇరాన్‌ ఆందోళన చెందుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు, ఘర్షణలు మరింత పెరగకుండా నిరోధించాలి’ అని జై శంకర్(S Jaishankar) అన్నారు.

మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్‌.. యూఎస్‌ నౌకపై క్షిపణులతో దాడి

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం వేళ ఇరాన్‌ మద్దతున్న హౌతీ రెబెల్స్‌ ఇటీవల ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం భారత్‌ (India)కు వస్తున్న వాణిజ్య నౌక (Ship)పై గుజరాత్‌ తీరంలో డ్రోన్‌ దాడి (Drone Strike) జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే సోమాలియా తీరంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. ఈ రెండు నౌకల్లో భారత సిబ్బంది విధుల్లో ఉన్నారు. మన నౌకాదళం రంగంలోకి దిగి, వారిని రక్షించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో జై శంకర్ పర్యటన జరుగుతోంది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో గాజాలో నెలకొన్న పరిస్థితులపై జై శంకర్‌ మాట్లాడారు. ‘గాజాలో జరుగుతోన్న ప్రాణ నష్టాన్ని నివారించడంపైనే మా దృష్టంతా ఉంది. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభానికి పరిష్కారం చూపాలి’ అని కోరారు. ఆ దిశగా అంతర్జాతీయ సమాజం చేస్తోన్న కృషిని స్వాగతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని