Joe Biden: స్టేజ్‌పై జో బైడెన్‌.. చెయ్యి పట్టుకుని సాయం చేసిన జిల్‌ బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్టేజ్‌ పై నుంచి కిందకు వచ్చేందుకు ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ సాయం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 07 Jan 2024 12:37 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) స్టేజ్‌పై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఆయన సతీమణి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2021 జనవరి 6వ తేదీన జరిగిన అల్లర్లను గుర్తు చేసుకుంటూ ప్రసంగించిన తర్వాత స్టేజ్‌పై నుంచి ఆయనను జిల్‌ బైడెన్‌ (Jill Biden) చెయ్యి పట్టుకుని తీసుకువచ్చారు. గతంలో ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన పలుమార్లు గందరగోళ పరిస్థితికి గురయ్యారు. స్టేజ్‌పైనే ఉండి గాల్లోనే కరచాలనం చేయడం, ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా వైట్‌ హౌస్‌ సిబ్బంది జిల్‌ బైడెన్‌ను స్టేజ్‌పైకి అనుమతించినట్లు ‘ఫాక్స్‌ న్యూస్‌’ పేర్కొంది.

ట్రంప్‌ అనర్హత కేసుపై సత్వరమే విచారణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జో బైడెన్‌.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ట్రంప్‌ అధికారంలోకి రావడం కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడతారు. నాజీ జర్మన్‌ మనస్తత్వం కలిగిన ఆయన తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. విద్వేషపూరిత ప్రసంగాలతో అమెరికన్ల మనసులను విషపూరితం చేస్తున్నారు’’ అని బైడెన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఎన్నికైన వారిలో జో బైడెన్‌ (81) అతి పెద్ద వయస్కుడు. డెమొక్రటిక్‌ పార్టీ తరపున మరోసారి ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని