Joe Biden: అమెరికాలోని యూఎస్‌ అంటూ బైడెన్‌ వ్యాఖ్య.. రిపబ్లికన్ల విమర్శలు

అమెరికాలోని యూఎస్‌ అంటూ అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్లకు ప్రచారాస్త్రంగా మారాయి. ఆయన దేశం గురించి మర్చిపోయారని విమర్శలు చేస్తున్నారు.

Published : 14 Mar 2024 14:41 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని యూఎస్‌లో తక్కువ ద్రవ్యోల్బణం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి రిపబ్లికన్లకు ప్రచారాస్త్రంగా మారాయి. అమెరికాలో దేశాలు ఉన్నాయా? దేశం గురించి ఆయన మర్చిపోయారని విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ నిత్యావసర ధరల కంటే వేగంగా వేతనాలు పెరుగుతున్నాయి. అమెరికాలోని యూఎస్‌లో ఏ దేశంలో లేనంత తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. దాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. బుధవారం విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్వాకీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన ప్రభుత్వ ఆర్ధిక విధానాలను సమర్థించుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో పలువురు నెటిజన్లు బైడెన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో అని చెప్పబోయి.. అమెరికా అని ఉంటారని ట్వీట్లు చేస్తున్నారు. 

మళ్లీ బైడెన్‌-ట్రంప్‌ ఢీ

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల నివేదిక వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి సరిగా లేదని పేర్కొన్నారు. జీవితంలోని కీలక సంఘటనలను సైతం గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపారు. ఈ నివేదికను బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. గత నెలలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఆయన ఫిట్‌గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మరోసారి ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోటీపడేందుకు సిద్ధమయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని