Maldives: భారత దళాలు మా దేశాన్ని వీడాలి: మాల్దీవులు కొత్త అధ్యక్షుడు

మాల్దీవుల్లో(Maldives) ఉన్న భారత బలగాలు(Indian Troops) తమ దీవుల్ని విడిచి వెళ్లిపోవాలని అడుగుతామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు(Mohamed Muizzu) వ్యాఖ్యలు చేశారు. 

Updated : 11 Jan 2024 14:08 IST

మాలే: మాల్దీవులు(Maldives) పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు(Mohamed Muizzu) అన్నారు. తమ ద్వీపంలో మోహరించిన భారత బలగాలు(Indian Troops) వెళ్లిపోవాలని కోరతామని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతున్న వేళ.. ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

‘మా గడ్డపై భారత సైన్యం(Indian Troops) ఉంది. ఇతర దేశాలకు చెందిన సైన్యం మా వద్ద ఉన్నా కూడా నా స్పందన ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న సైన్యం గురించి ఇప్పటికే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాం. అవి విజయవంతంగా జరుగుతున్నాయి. రెండు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ద్వైపాక్షిక సంబంధాలను మేం కోరుకుంటాం. భారత దళాల స్థానంలో ఇతర దేశాలకు చెందిన బలగాలను అనుమతించం. వారిని వెళ్లమనడమంటే.. చైనా లేక ఇతర దేశాలకు చెందిన దళాలను అనుమతిస్తామని కాదు’ అని మయిజ్జు(Mohamed Muizzu,) అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో.. హమాస్‌ కీలక నేతలు హతం..!

మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు.. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి.

ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌ నేత, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మొహ్మద్ మయిజ్జు ఇటీవల మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన నవంబర్‌ 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు. హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహమైన మాల్దీవులకు భారత్‌తోనే అనుబంధం ఎక్కువ. అయితే 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌ గయూమ్‌ భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్‌ భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు. మయిజ్జు రాకతో మళ్లీ చైనా వైపు వెళ్లేందుకు మాల్దీవులు ప్రయత్నించవచ్చని భారత రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు చిన్న దేశం కావడంతో భారత్‌ ఎక్కువగా సాయం చేసింది. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశముంది. దీంతో ముందుగానే మాల్దీవుల యంత్రాంగాన్ని కట్టడి చేయాలని రక్షణ రంగ నిపుణులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని