Maldives: భారత హెలికాప్టర్‌, సిబ్బందిపై ఇక పూర్తి నియంత్రణ మాదే: మాల్దీవులు

Maldives: చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌తో వివాదాలకు తెరతీసిన మాల్దీవులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి భారత్‌ ఇచ్చిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోబోతున్నట్లు మాల్దీవుల రక్షణ దళం ప్రకటించింది.

Updated : 08 Mar 2024 13:54 IST

మాలె: క్రమంగా చైనా పంచన చేరుతున్న మాల్దీవులు (Maldives).. భారత వ్యతిరేక వైఖరికి మరింత పదును పెడుతోంది. ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్‌ అందజేసిన హెలికాప్టర్‌, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ‘మాల్దీవుల జాతీయ రక్షణ దళం (MNDF)’ గురువారం ప్రకటించింది.

భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్‌డీఎఫ్‌లోని ‘ప్లాన్స్‌, పాలసీ, రీసోర్సెస్‌ విభాగం’ డైరెక్టర్‌ కర్నల్‌ అహ్మద్‌ ముజుథబ మహమ్మద్‌ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. మరోవైపు మాల్దీవులకు (Maldives) అందజేసిన హెలికాప్టర్‌ను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో సాధారణ పౌర నిపుణుల బృందాన్ని పంపినట్లు భారత్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

నిరుడు జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల ముయిజ్జు.. భారత్‌ అనుకూల మహమ్మద్‌ సోలీని ఓడించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు భారత దళాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ప్రకటించి వివాదానికి తెరతీశారు. మరోవైపు భారత్‌తో కుదుర్చుకున్న 100 ఒప్పందాలను సమీక్షిస్తామని ఇటీవల ప్రకటించారు. సముద్రగర్భ సర్వేలు నిర్వహించడానికి గతంలో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించబోవడం లేదని తెలిపారు.

చైనాకు దగ్గరయ్యే క్రమంలో ఆ దేశంలో వివిధ ఒప్పందాలకు సిద్ధమయ్యారు. బాష్పవాయు గోళాలు, పెప్పర్‌ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను చైనా ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ దేశ సైనికులకు శిక్షణ కూడా ఇస్తుందని స్వయంగా ముయిజ్జు ప్రకటించారు. మరోవైపు రాజధాని మాలె సమీప జలాల్లో చైనా పరిశోధన నౌక వారం రోజులపాటు సంచరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని