Sri Lanka: శ్రీలంకలో ప్రైవేటు వ్యక్తుల ఇంధన కొనుగోళ్లపై నిషేధం

శ్రీలంకలో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో అత్యవసరం కాని సేవలకు వినియోగించే వాహనాలకు ఇంధన విక్రయాలను నిలిపివేస్తూ

Updated : 28 Jun 2022 13:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో అత్యవసరం కాని సేవల వాహనాలకు ఇంధన విక్రయాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ  అయ్యాయి. వచ్చే రెండు వారాలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఈ ఆదేశాల ప్రకారం.. బస్సులు, రైళ్లు, వైద్య సౌకర్యాలకు వినియోగించేవి, ఆహార రవాణాకు వాడే వాహనాలకు మాత్రమే ఇంధనం సరఫరా చేయనున్నారు. ఇక ప్రైవేటు వాహనదారులు పెట్రోల్‌ కొనడాన్ని పూర్తిగా నిషేధించారు. శ్రీలంక మంత్రివర్గ ప్రతినిధి బందుల గుణవర్ధన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ చూడనంత సంక్షోభాన్ని దేశం చవి చూస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికే రష్యా, ఖతార్‌ నుంచి చమురు కొనుగోలు అంశాన్ని చర్చించేందుకు శ్రీలంక అధికారులు ఆయా దేశాలకు వెళ్లారు. గత వారాంతానికి దేశంలో కేవలం 9,000 టన్నుల డీజిల్‌, 6,000 టన్నుల పెట్రోల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఒక వారానికి మాత్రమే సరిపోతుందని భావిస్తున్నారు. దీంతో కేవలం అత్యవసరమైన సేవలకే ఇంధనం అందుబాటులో ఉంది.

శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు ఐఎంఎఫ్‌ సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. గత వారం అంతర్జాతీయ ద్రవ్యనిధి బృందం ఇక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా 3 బిలియన్‌ డాలర్ల బెయిలౌట్‌ డీల్‌పై సంప్రదింపులు జరిపింది. మరోవైపు లంక ప్రభుత్వం నిత్యావసరాల కోసం భారత్‌, చైనాల సాయం కోరింది. వచ్చే ఆరు నెలల్లో ఆహార, ఇంధనం, ఎరువల అవసరాలు తీరేందుకు 5 బిలియన్‌ డాలర్లు అవసరమని  ఆ దేశ ప్రధాని రణీల్‌ విక్రమసింఘే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని