Viral news: వామ్మో బామ్మ.. డిగ్రీ కోసం 70 ఏళ్లు పట్టింది!

అమెరికాకు చెందిన బామ్మ.. 70 ఏళ్ల క్రితం వదిలేసిన డిగ్రీని తాజాగా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నార్తర్న్‌ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి

Updated : 24 Mar 2023 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాకు(America) చెందిన డెఫావ్‌కు 90 ఏళ్లు. ఇద్దరు భర్తలు. 9 మంది సంతానం, 24 మంది మనవలు, మనవరాళ్లు. మరో 17 మంది మునిమనవలు. 90 పదుల వయస్సులోనూ ఆమెకు చదువుపై శ్రద్ధ తగ్గలేదు. 70 ఏళ్ల క్రితం వదిలేసిన డిగ్రీని తాజాగా ఆమె పూర్తి చేసి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికి ముందు జాయిస్‌ వియోలా కనే 1951లో అమెరికాలోని నార్తర్న్‌ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ (NIU)లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ జనరల్‌ స్టడీస్‌ కోర్సులో చేరారు. అప్పుడే డాన్‌ ఫ్రీమాన్‌ అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కళాశాలకు వెళ్లిన ఆమె.. 1955లో అతడిని వివాహమాడారు. దీంతో ఆమె పేరు జాయిస్‌ డెఫావ్‌గా మారిపోయింది. 

ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో డెఫావ్‌ చదువుకు స్వస్తి చెప్పారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రీమాన్‌ మృతి చెందాడు. దీంతో ఆమె మరో వివాహం చేసుకున్నారు. మళ్లీ వారికి ఆరుగురు పిల్లలు. మొత్తం తొమ్మిది మంది పిల్లలు పెద్దవారైన తర్వాత రెండో భర్త కూడా కన్నుమూశారు. వాళ్ల పిల్లలకు పెళ్లిళ్లు కూడా పూర్తయి.. కొందరు మనవళ్లకు కూడా వివాహాలు జరిగిపోయాయి. ప్రస్తుతం 90 ఏళ్ల వయస్సున్న ఆమెకు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీనికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. దీంతో 2019లో పాతకాలం నాటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఐడీ కార్డుతో మళ్లీ కాలేజీలోకి అడుగుపెట్టారు డెఫావ్‌.

అయితే, ఆమె వయస్సు రీత్యా యూనివర్సిటీ అధికారులు కూడా ఇంటి నుంచి ఆన్‌లైన్‌లోనే క్లాసులు వినేందుకు అనుమతించారు. కుటుంబసభ్యులంతా ఆమె ఉంటున్న రిటైర్‌మెంట్ హోంలో ఓ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి సహకరించారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు యూనివర్సిటీ యాజమాన్యం డిసెంబరు 5న డిగ్రీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా డెఫావ్‌ మాట్లాడుతూ..‘మన గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇతరులకు తెలుస్తాయి. నా కుటుంబ సభ్యులంతా నాపై నమ్మకం ఉంచారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు.’’ అని అన్నారు. ఆమె మనవరాళ్లలో ఒకరైన జెన్నా డోలే ఎన్‌ఐయూ పూర్వ విద్యార్థుల సంఘంలో సభ్యురాలిగా ఉండటం కూడా బామ్మకు కలిసొచ్చింది. ఆమె స్వయంగా యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి డెఫావ్‌ డిగ్రీ పూర్తి చేసేందుకు సహకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని