Pakistan: ఆ అఫ్గానీయులు వెళ్లిపోవాల్సిందే..! డెడ్‌లైన్‌ వేళ పాక్‌ స్పష్టీకరణ

అక్రమంగా ఉంటున్న అఫ్గానీయులు నవంబరు 1లోపు దేశం విడిచి వెళ్లాల్సిందేనని, గడువు పొడిగించే ప్రసక్తే లేదని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది.

Published : 26 Oct 2023 14:28 IST

ఇస్లామాబాద్‌: అనుమతి లేకుండా తమ దేశంలోకి వచ్చిన అఫ్గానీయులు వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్థాన్‌ (Pakistan) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనే అని ఐరాస (UN) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. ఇస్లామాబాద్‌ తన నిర్ణయంపై ముందుకెళ్తోంది. గడువు పొడిగింపు (నవంబరు 1) ప్రసక్తే లేదని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గడువు దాటినా.. ఇంకా ఇక్కడే ఉండేవారిని అరెస్టు చేసి, తరలించేందుకు వీలుగా  కేంద్రాలు (Deportation Centers) ఏర్పాటు చేస్తోంది.

స్థానికంగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జన్ అచక్జాయ్ తెలిపారు. తమ ప్రాంతంలోనూ మూడు కేంద్రాలు ఉంటాయని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి అజం ఖాన్ చెప్పారు. దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినప్పటినుంచి దాదాపు 60 వేల మందికి పైగా అఫ్గాన్లు స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు ఆయన చెప్పారు.

మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్‌ హుకుం!

అఫ్గాన్‌ను 2021లో తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత లక్షలాదిమంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13 లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17 లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వచ్చినవారంతా నవంబర్‌ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు.

మరోవైపు.. అఫ్గానిస్థాన్‌ ప్రజలపై పాకిస్థాన్‌ ఉక్కుపాదం మోపడాన్ని ఐరాస ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. దాదాపు 17 లక్షలకుపైగా అఫ్గాన్‌ శరణార్థులను బలవంతంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను ఆ దేశం చేపట్టడాన్ని తప్పుపట్టింది. ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. దీంతో కుటుంబాలు వేరు పడతాయని, మైనర్లపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని