Pakistan: పాక్‌ గగనతలంలోకి సూపర్‌సోనిక్‌ ప్రొజెక్టైల్‌.. భారత్‌కు పాకిస్థాన్‌ సమన్లు..!

భారత్‌కు చెందిన ఓ గుర్తుతెలియని సూపర్‌సోనిక్‌ విమానంగా భావిస్తోన్న ‘ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌’ తమ గగనతలంలోకి వచ్చిందంటూ పాకిస్థాన్‌ ఆరోపించింది.

Published : 11 Mar 2022 14:03 IST

దర్యాప్తు జరిపించాలని కోరిన పాకిస్థాన్‌ విదేశాంగశాఖ

దిల్లీ: భారత్‌కు చెందిన ఓ గుర్తుతెలియని సూపర్‌సోనిక్‌ క్షిపణిగా భావిస్తోన్న ‘ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌’ తమ భూభాగంలో పడిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ అనుమానాస్పద పరికరం పాకిస్థాన్‌లోని మియాన్‌ చన్నూ నగరంలో కుప్పకూలినట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌ గగనతల సరిహద్దును ఉల్లంఘించారని నిరసిస్తూ భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.

‘ఈనెల 9వ తేదీన భారత్‌ వైపు నుంచి ప్రయోగించిన ఓ వేగవంతమైన ‘అన్‌-ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌’ పాకిస్థాన్‌ భూభాగంలోకి దూసుకొచ్చింది. ఆ ప్రయోగం పాక్‌లోని పౌరుల ఆస్తులకు నష్టం కలిగించడంతోపాటు ఇక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది’ అని భారత రాయబారికి పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. అంతేకాకుండా తమ గగనతలంలోకి వచ్చిన ఈ అనుమానాస్పద ఫ్లయింగ్‌ ఆబ్జక్ట్‌ వల్ల ఇక్కడి దేశీయ/అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.

భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని భారత్‌కు సూచించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి.. ఆ సమాచారం తమకు తెలియజేయాలని పాక్‌ విదేశాంగశాఖ భారత రాయబారికి స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని