Pakistan: రిగ్గింగ్ నిజమే..ఆరోపిస్తూ రాజీనామా చేసిన ఎన్నికల అధికారి

ఇటీవల జరిగిన పాకిస్థాన్‌(Pakistan) ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల అధికారి ఒకరు రాజీనామా చేశారు. 

Published : 17 Feb 2024 18:22 IST

ఇస్లామాబాద్‌: ఇటీవల జరిగిన పాకిస్థాన్‌(Pakistan) ఎన్నికల్లో రిగ్గింగ్(poll rigging) జరిగిందని పోలింగ్‌ ఆఫీసర్ ఒకరు వివరాలు వెల్లడించారు.  ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అలాగే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ అతను రాజీనామా సమర్పించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(PTI) దేశవ్యాప్త నిరసనలు ప్రారంభించిన తరుణంలో ఈవిషయం వెలుగులోకి రావడం గమనార్హం. రావల్పిండి మాజీ కమిషనర్‌ లియాఖత్‌ అలీ చత్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారు. ఈ అవకతవకలకు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉంది.  దేశానికి వెన్నుపోటు పొడిచాను. అది నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. మేం చేసిన అన్యాయానికి మాకు శిక్ష పడాలి. ఆత్మహత్య చేసుకునేంతగా నాపై ఒత్తిడి వచ్చింది. చివరకు ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకున్నాను. ఈ నాయకుల కోసం  ఎలాంటి తప్పులు చేయొద్దని అధికారులను అభ్యర్థిస్తున్నాను’ అంటూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కాగా.. పోలింగ్‌ అనంతరం సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు పలు సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే లియాఖత్ ఆరోపణలు వచ్చాయి.

ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ(PTI) నిర్ణయించింది. పాక్‌ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు  పీటీఐ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు 92 సీట్లు గెల్చుకున్నారు. కానీ, పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. అనూహ్యంగా మరోసారి షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని