PM Modi: షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ ఫోన్‌.. చారిత్రక విజయానికి అభినందన

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన షేక్‌ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు.

Updated : 08 Jan 2024 23:18 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి చారిత్రక విజయం సాధించిన షేక్‌ హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి అభినందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్‌’వేదికగా వెల్లడించారు. ‘‘ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు ఫోన్‌ చేసి మాట్లాడాను. పార్లమెంటరీ ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాను. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకున్న బంగ్లాదేశ్ ప్రజలనూ అభినందించాను.  బంగ్లాదేశ్‌తో శాశ్వత, ప్రజా కేంద్రీకృత భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఉదయమే ఢాకాలో షేక్‌ హసీనాను భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మ కలిసి మన దేశం తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించిన షేక్‌ హసీనాకు కాంగ్రెస్‌ పార్టీ అభినందనలు తెలిపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’వేదికగా ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఆవామీ లీగ్‌, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌లు నాగరికత, సంస్కృతిపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ముడిపడి ఉన్నాయని.. 1971లో విముక్తి కోసం జరిగిన పోరాటంతో ఇరు దేశాల మధ్య బంధం బలపడిందని గుర్తు చేసుకున్నారు.  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సైతం షేక్‌ హసీనాకు అభినందనలు తెలిపారు. ‘‘ గెలుపు గెలుపే. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులు, ఆవామీ లీగ్‌ పార్టీకి నా అభినందనలు తెలుపుతున్నా. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్‌ 223 సీట్లు గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. అయితే, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్‌ పార్టీతో పాటు కొన్ని పార్టీలు ఈ ఎన్నికల్ని బహిష్కరించాయి. జాతీయ పార్టీ అభ్యర్థులకు 11 సీట్లు; మిగతా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, అధికార పార్టీపై తిరుగుబాటు చేసిన అభ్యర్థులు విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని