PM Modi: భారత మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఖతార్‌లో పర్యటించనున్నారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Published : 12 Feb 2024 16:32 IST

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 14న ఖతార్‌ (Qatar)కు వెళ్లనున్నారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని మోదీ ఖతార్‌ పర్యటన వివరాలు వెల్లడయ్యాయి.

‘ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు..’

13, 14వ తేదీల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో పర్యటించనున్న ప్రధాని.. అక్కడినుంచి దోహాకు వెళ్తారని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా సోమవారం ప్రకటించారు. ‘‘ప్రధాని మోదీ ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. మాజీ అధికారుల విడుదల ఆయన నాయకత్వానికి నిదర్శనం. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుంది. పర్యటనలో భాగంగా ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖతార్‌లో ప్రధాని మోదీకి ఇది రెండో పర్యటన’’ అని తెలిపారు.

గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది భారతీయుల విడుదల

18 నెలలుగా ఖతార్‌ జైల్లో ఉన్న భారత నావికాదళ మాజీ అధికారులకు విధించిన మరణ దండనను అక్కడి న్యాయస్థానం జైలుశిక్షగా మార్చింది. తాజాగా దానినుంచి కూడా విముక్తి కల్పించింది. దీంతో ఏడుగురు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. దోహా నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. కేంద్రం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని దిల్లీకి చేరుకున్న నేవీ మాజీ అధికారులు అన్నారు. ఈక్రమంలోనే ప్రధాని మోదీ.. ఖతార్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని