Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్‌

ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని పశ్చిమ దేశాలు తమపై నేరుగా యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపించింది. ఐరాసలో ప్రసంగించేందుకు వచ్చిన రష్యా మంత్రి సెర్గీ లవ్రోవ్‌ మాట్లాడుతూ జెలెన్‌స్కీ ప్రసంగం వినడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు.

Published : 24 Sep 2023 11:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ దేశాల శక్తులు ఉక్రెయిన్‌(Ukraine)కు మద్దతు ఇస్తూ నేరుగా మాస్కోపై యుద్ధంలోకి అడుగుపెట్టాయని రష్యా (Russia) విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ పేర్కొన్నారు. ఆయన ఐరాస కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు దీనిని ఏమైనా అనుకోండి. వారు నేరుగా మాతో పోరాటం చేస్తున్నారు. మనం దీనిని హైబ్రిడ్‌ యుద్ధతంత్రం అని అనుకోవచ్చు. కానీ, అది పరిస్థితులను మార్చలేదు. ఉక్రెయిన్‌ను వాడుకొని పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ కనీసం ఉక్రెయిన్‌పై దృష్టి పెడితే.. ఆయుధాలను విచ్చలవిడిగా సరఫరా చేసి అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతరులు ఇక్కడ పోరాడుతున్న విషయం అర్థమైపోతుంది’’ అని లవ్రోవ్‌ వెల్లడించారు. 

కెనడా అడుగు ఎటో!

ఈ క్రమంలో ఉక్రెయిన్‌ యుద్ధంలో పశ్చిమ దేశాల కిరాయి మూకలు పాల్గొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ దేశాలు తమ ప్రజలను ఉక్రెయిన్‌ వెళ్లొద్దని చెప్పాయి. కానీ, కిరాయి సైనికులు మాత్రం వెళ్లారని వ్యాఖ్యానించారు. ఇక ఐరాసలో జెలెన్‌స్కీ ప్రసంగాన్ని ఓ టైమ్‌వేస్ట్‌ కార్యక్రమంగా లవ్రోవ్‌ అభివర్ణించారు. ‘‘నేను దాన్ని టీవీలో చూశాను. ఆయన (జెలెన్‌స్కీ) చాలా క్రూరంగా కనిపించారు. నేను హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలున్నాయి. ఆయనేం చెబుతాడో మనందరికి తెలుసు. అందుకే.. టైమ్‌ వేస్టు చేసుకోవడం ఎందుకు..?’’ అని రష్యా మంత్రి వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ ప్రతిపాదించిన ప్రణాళిక వాస్తవిక పరిస్థితులకు తగినట్లు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ ఈ విషయాన్ని తీవ్రంగా దృట్టిపెట్టాల్సిన అంశంగా పరిగణించడంలేదని భావిస్తున్నారే నిర్ణయానికి తాము వచ్చామని లవ్రోవ్‌ వెల్లడించారు. వారు యుద్ధ క్షేత్రంలోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనుకుంటే.. తాము కాదనమని రష్యా మంత్రి తేల్చిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని