Ukraine: కీవ్‌పై క్షిపణుల వర్షం.. రష్యా ఇరానియన్‌ డ్రోన్లు వాడింది: జెలెన్‌స్కీ

తమ దేశాన్ని భూమి నుంచి తుడిచిపెట్టేయాలని రష్యా చూస్తోందని వ్యాఖ్యానించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఈ దాడుల్లో రష్యా ఇరాన్‌కి చెందిన డ్రోన్లు ఉపయోగించిందని వెల్లడించారు.

Updated : 10 Oct 2022 17:09 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై పుతిన్‌ సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. ప్రతీకారంతో ఈ ఉదయం క్షిపణుల వర్షం కురిపించాయి. రష్యా-క్రిమియాలను కలిపే కెర్చ్‌ వంతెన కూల్చివేతలో ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం హస్తముందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించిన మరుసటిరోజే ఈ దాడులు ఆరంభం కావడం గమనార్హం. ఆ ఘటనకు ప్రతీకారంగానే కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా సైన్యం దాదాపు 75 క్షిపణులు ప్రయోగించగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఉక్రెయిన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంకోవైపు, జూన్‌ 26 తర్వాత కీవ్‌ నగరంపై ఉక్రెయిన్‌ దాడులకు దిగడం ఇదే తొలిసారి. తమ దేశాన్ని భూమి నుంచి తుడిచిపెట్టేయాలని రష్యా చూస్తోందని వ్యాఖ్యానించిన జెలెన్‌స్కీ.. ఈ దాడుల్లో రష్యా ఇరాన్‌కి చెందిన డ్రోన్లు ఉపయోగించిందని వెల్లడించారు. తమ దేశంలోని ఇంధన మౌలిక వసతులు, దేశ ప్రజలను రష్యా టార్గెట్‌ చేస్తోందని మండిపడ్డారు.

కీవ్‌లో విధ్వంసం

కీవ్‌ నగరంతో పాటు ఉక్రెయిన్‌లోని దక్షిణ, పశ్చిమ నగరాలను టార్గెట్‌గా చేసుకొని రష్కా సేనలు దాడులు చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. యుద్ధం ప్రారంభంలో కీవ్‌ను ఆక్రమించుకొనేందుకు జరిపిన దాడుల తర్వాత ఇంత ఉద్దృతంగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై దాడులు జరపడం ద్వారా ఇప్పటికే భారీ నష్టాన్ని కలిగించిన రష్యా.. ఆ దేశంలోని ఇంధనమౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. తాజా దాడుల నేపథ్యంలో కీవ్‌లో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు కూడళ్లలో రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, భవంతులతో పాటు, కార్లు దెబ్బతిన్నాయి. దీంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

రష్యా రాయబారిని వివరణ కోరాం: మోల్డోవా

ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకొని రష్యా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు తమ గగనతలాన్ని దాటి వెళ్లాయని మోల్డోవా తెలిపింది. దీనిపై మాస్కో రాయబారిని వివరణ అడిగినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి నికు పొపెస్కో ట్విటర్‌లో వెల్లడించారు. నల్ల సముద్రం నుంచి రష్యా నౌకల నుంచి ఈ ఉదయం మూడు క్రూయిజ్‌ క్షిపణులు మోల్డోవా గగనతలం మీదుగా దూసుకెళ్లాయని పేర్కొన్నారు. క్రిమియా- రష్యాను కలిపే వంతెనను పేల్చివేతకు గురికావడంపై ఉక్రెయిన్‌ను పుతిన్‌ నిందించిన మరుసటి రోజే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ వంతెన పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. దీన్ని పుతిన్‌ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. 

62వేల మందికి పైగా రష్యా సైనికుల మృతి!

మరోవైపు, రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ దీటుగా ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని సైనికపరంగా దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి అక్టోబర్‌ 10 వరకు రష్యాకు చేసిన నష్టం వివరాలను ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 62,870మంది రష్యా సైనికులు హతమైనట్టు ట్విటర్‌లో పేర్కొంది. అలాగే, శత్రుదేశానికి చెందిన 2495 యుద్ధ ట్యాంకులు, 5149 సాయుధ వాహనాలు, 267 మిలటరీ జెట్‌లు, 235 హెలికాప్టర్లు, 1097 డ్రోన్లు, 249 క్రూయిజ్‌ క్షిపణులు, 15 బోట్‌లు, 3908 వాహనాలు, ఇంధన ట్యాంకులు, 136 ప్రత్యేక పరికరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని