Akshata Murthy: ‘ఆమెను స్వదేశంతో బంధం తెంచుకోమనడం సమంజసం కాదు’: రిషి సునక్‌

బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి పన్ను చెల్లింపుల వ్యవహారంపై వస్తున్న విమర్శలను రిషి సునక్‌ కొట్టిపారేశారు.......

Updated : 09 Apr 2022 06:44 IST

ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టన అక్షతా మూర్తి భర్త రిషి సునక్‌

లండన్‌: బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి పన్ను చెల్లింపుల వ్యవహారంపై బ్రిటన్‌లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విమర్శలను రిషి సునక్‌ తిప్పికొట్టారు. తాజాగా ‘సన్‌’ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తన భార్య పుట్టినిల్లు భారత్‌ అని అక్కడే పన్నులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ‘ఆమె నన్ను వివాహం చేసుకున్న కారణంగా.. ఆమెను తన దేశంతో సంబంధాలను తెంచుకోమని కోరడం సమంజసం కాదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నట్లుగానే, ఆమె కూడా తన దేశాన్ని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని రిషి సునక్‌ పేర్కొన్నారు.

అక్షత బ్రిటన్‌లో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. అయితే ఆమె ఇప్పటికీ భారత పౌరురాలే. అందువల్ల ఇన్ఫోసిస్‌లో తనకున్న షేర్లు, వాటినుంచి వచ్చే ఆదాయంపై అక్షత బ్రిటన్‌లో పన్నులు చెల్లించనక్కర్లేదు. భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని ఆమోదించదు కాబట్టి ఆమె ఇప్పటికీ అక్కడే పన్నులు చెల్లిస్తున్నారు. బ్రిటన్‌లో ఓ వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీ డైరెక్టర్‌ హోదాలో మాత్రం తనకు లభించే ఆదాయంపై బ్రిటన్‌లోనే ఆమె పన్నులు చెల్లిస్తున్నారని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

గత నెలలో సునక్‌ సమర్పించిన మినీ బడ్జెట్‌లో ప్రజలపై ఎడాపెడా పన్నులు వేశారనీ, ఆయన భార్య మాత్రం ఇక్కడ పన్నులు చెల్లించకుండా భారత్‌లో చెల్లిస్తున్నారని విమర్శించాయి. తన మామయ్య నారాయణమూర్తిని చూసి తాను ఎంతో గర్విస్తున్నాననీ, ఎవరు ఎంతగా బురదజల్లినా ఆయనపై తన గౌరవం తగ్గదని సునక్‌ ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని