China: పోలీసుల ఫొటోలు తీసి.. 1400 రోజులు జైలుపాలై..!

చైనా (China)లో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. పోలీసుల ఫొటోలు తీసిన ఓ వ్యాపారిని గూఢచర్యం ఆరోపణలతో నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు.

Published : 29 Jul 2023 17:04 IST

బీజింగ్‌: నాలుగేళ్ల క్రితం చైనా (China) పర్యటనకు వచ్చిన ఓ తైవాన్‌ (Taiwan) వ్యాపారి అనుకోని విధంగా ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. పోలీసుల ఫొటోలు తీయడంతో ఆయన అరెస్టయ్యారు. దీంతో 1400 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ శిక్షను ముగించుకుని ఇటీవలే విడుదలైన అతడు.. తాను ఎదుర్కొన్న సమస్యలను మీడియాకు వివరిస్తూ ఉద్వేగానికి గురయ్యారు.

తైవాన్‌కు చెందిన లీ మెంగ్‌-చు 2019లో తన బిజినెస్‌ పనిమీద చైనా పర్యటనకు వచ్చారు. ఆయన బీజింగ్‌కు రావడం అదే తొలిసారి కాదు. అంతకుముందు ఆయన కొంతకాలం చైనా (China)లోనే పనిచేశారు. అయితే, నాలుగేళ్ల క్రితం లీ చైనా పర్యటనకు వచ్చిన సమయంలోనే.. హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఆయన ఊహించని విధంగా సమస్యల్లో చిక్కుకున్నారు.

తన కొలీగ్‌ను కలిసేందుకు షెంజెన్‌ వచ్చిన లీ.. అక్కడ ఓ హోటల్‌ గదిలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమయంలో అక్కడి పరిసర ప్రాంతాలను ఆయన ఫొటోలు తీశారు. తన వ్యాపారం కోసం 10 వీడియో కెమెరాలను కొనుగోలు చేశారు. షెంజెన్‌ నుంచి ఆయన తిరిగి వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టు అధికారులు ఈ వీడియో కెమెరాలను చూసి లీపై అనుమానపడ్డారు.

కుమారుని మరణవార్తతో ఆగిన తల్లి గుండె

దీంతో అతడి లగేజీ, ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో షెంజెన్‌ స్టేడియంలో ఆయన తీసిన పోలీసు బలగాల ఫొటోలు కన్పించాయి. దీంతో గూఢచర్యం, దేశ రహస్యాలను దొంగలిస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తాను, కేవలం ఓ వ్యాపారిని మాత్రమేనని, ప్రకృతి అందాలను ఆసక్తితో ఫొటోలు తీస్తానని ఆయన పోలీసులకు చెప్పారు. అంతేగాక, తాను ఫొటోలు తీసిన ప్రదేశాల్లో వార్నింగ్‌ బోర్డులు కూడా లేవని తెలిపారు. అయినా, లీ మాటలను పోలీసులు నమ్మలేదు.

72 రోజుల పాటు ఆయనను హోటల్‌లో నిర్బంధించారు. అప్పుడు కనీసం టీవీ, న్యూస్‌పేపర్ చూడనివ్వలేదని, కనీసం కర్టెన్లు కూడా తెరుచుకోనివ్వలేదని లీ వాపోయారు. ఆ తర్వాత అతడిని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అలా దాదాపు 1400 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన లీ.. ఇటీవలే శిక్ష ముగించుకుని విడుదలయ్యారు. చైనా చెర నుంచి బయటపడగలుగుతానని ఊహించలేదంటూ స్వదేశానికి బయల్దేరుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని