School Shooting: అమెరికాలో తుపాకీ మారణహోమం.. ట్రంప్ స్పందన ఇదే..!

ఇటీవల అమెరికా పాఠశాలలో పిల్లలపై తుపాకీ సృష్టించిన మారణహోమం ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Published : 28 May 2022 13:16 IST

వాషింగ్టన్‌: ఇటీవల అమెరికాలోని ఓ పాఠశాలలో పిల్లలపై జరిగిన తుపాకీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దాంతో తుపాకీ వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 

తుపాకీ వాడకంపై నియంత్రణలను కఠినతరం చేయాలనే డిమాండ్లను ట్రంప్‌ తోసిపుచ్చారు. చెడు నుంచి తమను తాము రక్షించుకునేలా తుపాకీ వాడేందుకు చట్టానికి లోబడి జీవించే అమెరికన్లను అనుమతించాలన్నారు. హూస్టన్‌లో నేషనల్ రైఫిల్ అసోషియేషన్ (ఎన్‌ఆర్‌ఏ) నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ... ‘ఇప్పటివరకూ తుపాకీ నియంత్రణకు ప్రతిపాదించిన విధానాలు ఈ తరహా ఘటనలు నియంత్రించడానికి ఏ మాత్రం ఉపకరించలేదు. ఈ విధానాలు వింతైనవి. మన చిన్నారులను రక్షించుకోవడానికి, పాఠశాలలను పటిష్టం చేసుకోవడానికి పార్టీలకతీతంగా మనమంతా ఏకం కావాలి’ అని సూచించారు. 

టెక్సాస్‌లోని యువాల్డీ పట్టణంలోని రాబ్‌ ప్రాథమిక పాఠశాలలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఓ యువకుడు రక్షణ కవచం ధరించి వచ్చి ఏఆర్‌-15 సెమీ ఆటోమేటిక్‌ తుపాకీతో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. ఆ మారణ హోమం 19 మంది బడిపిల్లల్ని, ఇద్దరు టీచర్లను బలిగొంది. అనేకమంది గాయపడ్డారు. ఈ అమానుష ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. శక్తిమంతమైన ‘గన్‌ లాబీ’కి కళ్లెం వేయడానికి శాసనకర్తలు నడుం బిగించాలంటూ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్వేగంతో పిలుపునిచ్చారు. ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘తమ బిడ్డను కోల్పోవడమంటే కన్నవారి ఆత్మ నుంచి ఒక భాగాన్ని కోసి తీసుకుపోవడమే. రక్తపాతాన్ని నిర్మూలించే దృఢ సంకల్పాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎన్నాళ్లు ఇలా దేవుడి దయకు వదిలేస్తాం? శక్తిమంతులైన తుపాకీ తయారీదారులకు అడ్డుకట్ట పడాలి. ఇకనైనా మన ఆవేదనను కార్యరూపంలోకి తీసుకువద్దాం’ అంటూ స్పందించారు. అమెరికాలో 2022లో ఇప్పటివరకు 200 పైగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని