Eiffel Tower: తప్పతాగి ఈఫిల్‌ టవర్‌ పైకెక్కి.. ఇద్దరు అమెరికా టూరిస్టుల నిర్వాకం

పూటుగా తాగిన ఇద్దరు అమెరికా పర్యాటకులు సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ ఎత్తైన ప్రాంతానికి చేరుకొని ఒక రాత్రంతా గడిపారు. ఉదయం గస్తీలో భాగంగా టవర్‌పైకి చేరుకొని భద్రతా సిబ్బందికి వీరు తారపడ్డారు. 

Updated : 16 Aug 2023 08:23 IST

ప్యారిస్‌: పూటుగా మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌లో అత్యంత ఎత్తైన అనుమతి లేని ప్రదేశానికి చేరుకొని ఒక రాత్రంతా నిద్రపోయారు. ఉదయాన్నే భద్రతా సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు కొని టవర్‌పైకి ఎక్కారు. టవర్‌ మూసివేత సమయం అవడంతో భద్రతా సిబ్బంది పర్యటకులను కిందికి దింపివేశారు. అయితే వీరు సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి పర్యాటకులకు అనుమతి లేని టవర్‌ ఎత్తైన రెండు మూడు లెవెల్స్‌ మధ్య ప్రాంతానికి చేరుకొన్నారు. మద్యం మత్తు కారణంగా కిందికి రాలేక అక్కడే రాత్రంతా పడుకున్నారు. 

స్టన్నింగ్‌ చిత్రంతో ఐఎస్‌ఎస్‌ నుంచి భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన యూఏఈ ఆస్ట్రోనాట్‌

పర్యాటకుల కోసం ప్రతి రోజు టవర్‌ను ఉదయం 9 గంటలకు తెరుస్తారు. అంతకు ముందే భద్రతా సిబ్బంది టవర్‌ గస్తీ చేపడతారు. ఈ క్రమంలో అనుమతిలేని ప్రాంతంలో వీరు పడుకున్న దృశ్యాన్ని భద్రతా సిబ్బంది గమనించి ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి వారిని జాగ్రత్తగా కిందికి దించినట్లు ఈఫిల్‌ టవర్‌ ఆపరేట్‌ సంస్థ సెటె పేర్కొంది. అనంతరం వీరిని ప్యారిస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ తతంగంతో సోమవారం ఉదయం గంటపాటు ఆలస్యంగా పర్యాటకులను టవర్‌పైకి అనుమతిచ్చారు. 

ఈఫిల్‌ టవర్‌ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ ఈ ఘటన జరగడానికి ఒక్కరోజు ముందు ఓ దుండగుడు బెదిరింపు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది టవర్‌, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సందర్శకులను అక్కడి నుంచి బయటకు పంపి బాంబు నిర్వీర్య బృందాలతో జల్లెడ పట్టారు. 330 మీటర్లు ఉన్న ఎత్తైన ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని 1887లో చేపట్టారు. 1889లో మార్చి 31న పూర్తయింది. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ను సందర్శస్తారు. గతేడాది 62 లక్షలకు పైగా పర్యాటకులు వచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని