EU: ఈయూలో ఉక్రెయిన్‌ సభ్యత్వానికి 20 ఏళ్లు పట్టొచ్చు.. ఫ్రాన్స్‌ మంత్రి

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో చేరాలనే ఉక్రెయిన్‌ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు! ఈయూలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పెట్టుకున్న దరఖాస్తు 15- 20 ఏళ్లకుగాని ఖరారు కాదని ఫ్రాన్స్ యూరోపియన్‌ వ్యవహారాల మంత్రి క్లెమెంట్‌ బ్యూన్‌...

Published : 23 May 2022 01:45 IST

పారిస్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో చేరాలనే ఉక్రెయిన్‌ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు! ఈయూలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పెట్టుకున్న దరఖాస్తు 15-20 ఏళ్లకుగాని ఖరారు కాదని ఫ్రాన్స్ యూరోపియన్‌ వ్యవహారాల మంత్రి క్లెమెంట్‌ బ్యూన్‌ తాజాగా వెల్లడించారు. ‘ఈ విషయంలో నిజాయతీగా ఉండాలి. ఆరు నెలలు, ఏడాది లేదా రెండేళ్లలో ఉక్రెయిన్ ఈయూలో చేరబోతోందని ఎవరైనా చెబితే.. వారు అబద్ధం చెబుతున్నట్లే. ఐరోపా సమాఖ్యలో ఉక్రెయిన్‌ చేరికకు చాలా సమయం పడుతుంది. బహుశా 15 లేదా 20 ఏళ్లలో ఇది పూర్తి కావచ్చు’ అని ఓ రేడియో సంస్థతో ఆయన అన్నారు.

ఇటీవల ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ సైతం.. ఐరోపా సమాఖ్యలో ఉక్రెయిన్‌ సభ్యత్వానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో సమాంతర సంఘంలో ఉక్రెయిన్‌ చేరాలని సూచించారు. అప్పుడు ఐరోపా సమాఖ్యేతర దేశాలు.. ఐరోపా సెక్యూరిటీ ప్లానింగ్‌లో భాగమయ్యే అవకాశం లభిస్తుందన్నారు. అయితే, ఈ ప్రతిపాదనను జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఐరోపా సమాఖ్యలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత నాలుగు రోజులకే రష్యా దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈయూలో చేరేందుకు రెండో దశ అప్లికేషన్‌ను ఇటీవల అందజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని