Ukraine: క్రెమ్లిన్‌ ‘నేటి నిజమైన హిట్లర్‌’.. వారికి రక్తం రుచి ఇష్టమని తేలింది!

మేరియుపోల్‌లో రష్యా సైన్యం మారణహోమానికి పాల్పడుతోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ విమర్శించారు.

Published : 18 Mar 2022 01:25 IST

రష్యాపై ధ్యజమెత్తిన ఉక్రెయిన్‌ రక్షణశాఖ

కీవ్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. దాడులను రోజురోజుకు మరింత తీవ్రతరం చేస్తోంది. ఆస్పత్రులు, జనసముదాయాలు, పాఠశాలలు, థియేటర్లు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా మేరియుపోల్‌ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా వెయ్యిమందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్‌పై దాడి చేయడం తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో మేరియుపోల్‌లో రష్యా సైన్యం మారణహోమానికి పాల్పడుతోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ విమర్శించారు. తమ దేశాన్ని నాశనం చేయడమే క్రెమ్లిన్‌ (రష్యా అధ్యక్ష భవనం) ఉద్దేశమన్న ఆయన.. ‘ప్రస్తుత కాలానికి నిజమైన హిట్లర్‌’ అని ధ్వజమెత్తారు.

మూడు వారాల క్రితం సైనిక చర్య పేరుతో దాడులను మొదలుపెట్టిన రష్యా సైన్యం.. భీకర దాడులతో ఉక్రెయిన్‌ను వణికిస్తోంది. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతుండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే, తాజా పరిస్థితులను బట్టి ఉక్రెయిన్‌ను నిరాయుధీకరణ చేస్తామని రష్యా ప్రకటించడం అవాస్తవమని ఉక్రెయిన్‌లోని మైకొలీవ్‌ మేయర్‌ ఒలెక్సాండర్‌ సెంకెవిచ్‌ పేర్కొన్నారు. తాజాగా మేరియుపోల్‌ థియేటర్‌పై దాడిని చూస్తుంటే.. రష్యన్‌లకు రక్తం రుచి ఇష్టమని తేలిందని విమర్శించారు. ఇటువంటి మారణహోమాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌ చేస్తోన్న ప్రతిదాడుల్లో దాదాపు 14వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రతిదాడుల్లో రష్యాకు చెందిన 444 ట్యాంకులు, 1435 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 86 విమానాలు, 108 హెలికాప్టర్లు, 11 యూఏవీలను నేలకూల్చినట్లు వివరించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 43 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని