Austin: రక్షణమంత్రి అనారోగ్యం గురించి బైడెన్‌కు తెలియదు..అనుమానాలకు తావిస్తున్న గోప్యత

అమెరికా రక్షణమంత్రి అనారోగ్యంపై పెంటగాన్‌ పాటిస్తోన్న గోప్యత పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనకు క్యాన్సర్ సర్జరీ జరిగిందని నిన్నటివరకు అధ్యక్షుడు బైడెన్‌(Joe Biden)కు కూడా తెలియకపోవడం గమనార్హం. 

Updated : 10 Jan 2024 17:10 IST

వాషింగ్టన్: అమెరికా(USA) రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్ (Lloyd Austin) కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రొస్టేట్‌ క్యాన్సర్ బారినపడగా, గతనెలలో సర్జరీ జరిగింది. ఆయన అనారోగ్యం గురించి నిన్నటివరకు(మంగళవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Jeo Biden)కు తెలియకపోవడం గమనార్హం. తాము సమాచారం ఇవ్వలేదని రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ అంగీకరించింది.

70 ఏళ్ల ఆస్టిన్‌(Austin) జనవరి ఒకటిన వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో చేరారు. అయితే ఆసుపత్రిలో చేరిక విషయాన్ని పెంటగాన్‌ గోప్యంగా ఉంచింది. గతవారం వరకు వైట్‌హౌస్‌, కాంగ్రెస్‌కు దీనిపై సమాచారం లేదు. ‘ఆస్టిన్‌ ఆసుపత్రిలో చేరికపై గత గురువారం వరకు బైడెన్‌కు సమాచారం లేదు. ఆసుపత్రిలో చేరడానికి కారణం ప్రొస్టేట్ క్యాన్సర్ అని ఈ మంగళవారం వరకు అధ్యక్షుడికి తెలియదు’ అని వైట్‌హౌస్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు. వైట్‌హౌస్‌లో ఎవరికీ కూడా దీని గురించి తెలియదన్నారు. శనివారం ఆస్టిన్‌, బైడెన్‌ మాట్లాడుకున్నారు. కానీ నిన్నటివరకు రక్షణ మంత్రి అనారోగ్యం గురించి బైడెన్‌కు తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిరోజులపాటు రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి కాథ్లీన్‌ హిక్స్‌ వద్ద కూడా ఈ గోప్యత పాటించడం.. రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

‘ఉక్రెయిన్‌, గాజాలో యుద్ధాలు జరుగుతోన్న తరుణంలో మీ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది అధ్యక్షుడు, చివరకు మీ డిప్యూటీకి కూడా సమాచారం ఇవ్వకపోవడం.. ఆమోదయోగ్యం కాదు’ అని ఆస్టిన్‌ను రిపబ్లికన్ పార్టీ తప్పుపట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని