USA: మేం మరో యుద్ధం కోరుకోవడం లేదు: అమెరికా

USA: జోర్డాన్‌లో జరిగిన దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. అయితే, తాము మరో యుద్ధం మాత్రం కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.

Updated : 30 Jan 2024 10:24 IST

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో తాము మరో యుద్ధం కోరుకోవడం లేదని.. ఉద్రిక్తతలను పెంచాలన్నదీ తమ ఉద్దేశం కాదని అమెరికా (USA) స్పష్టం చేసింది. అయితే, తమని తాము రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని సోమవారం తేల్చి చెప్పింది. జోర్డాన్‌లో (Jordan) అమెరికా స్థావరంపై ఆదివారం జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

జోర్డాన్‌లో (Jordan) జరిగిన దాడిలో మరో 30 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ సమన్వయకర్త జాన్‌ కిర్బీ వెల్లడించారు. ఐసిస్‌ ఉగ్రముప్పును ఎదుర్కోవటంలో భాగంగా భాగస్వామ్య దేశాలతో కలిసి ఆ ప్రాంతంలో అమెరికా (USA) సైనికులు కీలక మిషన్‌ చేపట్టారని పేర్కొన్నారు. అది ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనితో ఇజ్రాయెల్‌ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాజా దాడికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ మరింత లోతైన సమాచారాన్ని సేకరిస్తోందని వెల్లడించారు.

Tower 22: ఏమిటీ స్థావరం? అమెరికాకు ఎందుకంత కీలకం?

అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సిబ్బందితో ఇప్పటికే రెండు సార్లు సమావేశమయ్యారని కిర్బీ తెలిపారు. జోర్డాన్‌లో జరిగిన దాడిపై ఎలా ప్రతిస్పందించాలో సమాలోచనలు జరిపారని వివరించారు. ఇరాన్‌ మద్దతున్న సంస్థలే ఈ దాడులకు పాల్పడ్డాయని ఆరోపించిన ఆయన.. అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సేకరించి ఎదురుదాడి చేస్తామని తెలిపారు. మరో సమావేశంలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

జోర్డాన్‌లోని (Jordan) అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. తామే ఈ దాడికి పాల్పడ్డట్లు ఇరాక్‌ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి. తమ స్థావరంపై దాడి ఇరాన్‌ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని