Tower 22: ఏమిటీ స్థావరం..? అమెరికాకు ఎందుకంత కీలకం..?

జోర్డాన్‌ ఈశాన్య ప్రాంతంలో తమ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు డ్రోన్‌ దాడులు జరపడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది.

Published : 30 Jan 2024 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జోర్డాన్‌లో ఉన్న సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడితో (Drone Attack) అమెరికా ఉలిక్కిపడింది. ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు పదుల సంఖ్యలో గాయపడిన ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ దాడితో ఇరాన్‌కు సంబంధముందనే అనుమానం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం.. సరైన సమయంలో దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జోర్డాన్‌లోని అత్యంత కీలకమైన ఆ ప్రదేశం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే..

మూడు దేశాల సరిహద్దు..

జోర్డాన్‌ ఈశాన్య ప్రాంతంలో అమెరికాకు ఉన్న సైనిక స్థావరాన్నే టవర్‌ 22గా (Tower 22) పేర్కొంటారు. సిరియా, ఇరాక్‌, జోర్డాన్‌.. మూడు దేశాల సరిహద్దులు కలిసే చోటు ఇది. అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఇస్లామిక్‌ స్టేట్‌పై (ISIS)పోరుకు ఇదెంతో కీలకం. సిరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరమైన అల్‌-టాన్ఫ్‌కు అతికొద్ది దూరంలో ఉండటం కలిసివచ్చే అంశం. ఇరాన్‌ బలగాలను ఎదుర్కొనేందుకు అనువైన వ్యూహాత్మక ప్రదేశంగా అగ్రరాజ్యం దీన్ని భావిస్తోంది. దాదాపు 350 మంది యూఎస్‌ సైనికులు, వైమానిక సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంజినీరింగ్‌, ఏవియేషన్‌, లాజిస్టిక్‌, సెక్యూరిటీ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.

తన్నుకున్న ఎంపీలు.. ముష్టిఘాతాలతో దద్దరిల్లిన మాల్దీవుల పార్లమెంటు

ఐదు దేశాల సరిహద్దులున్న జోర్డాన్‌లో దాదాపు 3వేల మంది అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. స్థానిక బలగాలతో కలిసి ఏడాది పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు కొనసాగిస్తూనే ఉంటుంది. సిరియా, ఇరాక్‌ నుంచి మిలిటెంట్లు చొరబడకుండా అడ్డుకునే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు లక్షల డాలర్లను అమెరికా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా అనేక విధాలుగా కీలకమైన స్థావరం కావడంతో మిలిటెంట్లు దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

150 సార్లు దాడులు..

ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ మద్దతు కలిగిన మిలిటెంట్‌ బృందాలు ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నట్లు పెంటగాన్‌ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా స్థావరంపై డ్రోన్‌ దాడి జరగడం.. మధ్యప్రాచ్యంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 150సార్లు తమ స్థావరాలపై దాడులు జరిగినట్టు అమెరికా రక్షణ విభాగం పేర్కొంది. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులతో  దాడులు జరిగాయని ఆరోపించింది. వీటికి తమదే బాధ్యత అని ఇరాక్‌ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ గ్రూపు ప్రకటించింది. అయితే, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని మిలిటెంట్‌ బృందాలు సరిహద్దు నుంచి దూరంగా వెళ్లిపోతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని