China: చైనాది బాధ్యతారాహిత్యం: అమెరికా

తైవాన్‌ సమీపంలో చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలను అమెరికా తప్పుబట్టింది. అవి పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన కవ్వింపు చర్యలుగా పేర్కొంది. తమపై దాడికి చైనా సిద్ధమవుతోందంటూ తైవాన్‌ ఆరోపించిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 07 Aug 2022 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ సమీపంలో చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలను అమెరికా తప్పుబట్టింది. అవి పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన కవ్వింపు చర్యలుగా పేర్కొంది. తమపై దాడికి చైనా సిద్ధమవుతోందంటూ తైవాన్‌ ఆరోపించిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటించడాన్ని చైనా తీవ్రంగా పరిగణించి ఈ  యుద్ధ విన్యాసాలు చేపట్టింది.

తాజాగా చైనాకు చెందిన విమానాలు, నౌకలు బఫర్‌ జోన్‌ దాటి తైవాన్‌ జలాల్లోకి వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ  కూడా ధ్రువీకరించింది. అవసరమైన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని తైవాన్‌ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశంపై దాడికి చైనా రిహార్సల్స్‌ చేస్తోందని వెల్లడించింది. తైవాన్‌ ప్రీమియర్‌ సు త్సెంగ్‌ ఛాంగ్‌ మాట్లాడుతూ..‘‘స్థానిక సుస్థిరతను దెబ్బతీసేలా చైనా అహంకారపూరితంగా  వ్యవహరిస్తోంది. చైనా వైపు కొంత సంయమనం పాటించాలి’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు ఈ యుద్ధ విన్యాసాలపై చైనా స్పందించలేదు. నాలుగు రోజులు జరిగే ఈ విన్యాసాలు ఆదివారంతో ముగిసే అవకాశం ఉంది. చైనా తీరుపై అమెరికాలోని శ్వేత సౌధం ప్రతినిధి స్పందిస్తూ..‘‘ప్రస్తుతం యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. అవి పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన కవ్వింపు చర్యలు. ముప్పును పూర్తిగా అంచనా వేయలేకపోతోంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని